రసవత్తరం.. ‘చింతలపూడి’ రాజకీయం..!

ప్రజాశక్తి – చింతలపూడి

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చింతలపూడి నియోజకవర్గ రాజకీయాలు వేడెక్కాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు గెలుపుగుర్రాలనే రంగంలోకి దించాలనే ఉద్దేశంతో ముందుకుసాగుతున్నాయి. ఈ క్రమంలో సిట్టింగ్‌ ఎంఎల్‌ఎను సైతం మార్పుచేసే ఆలోచనలో అధికారపార్టీ ఉంది. దీంతో ఆ పార్టీలో గ్రూపు విబేధాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పోటీలో బలమైనా అభ్యర్థులుంటేనే గెలుపు సాధ్యమని, అలాంటివారినే బరిలోకి దింపుతామని ఆయా పార్టీల అధినేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలోనే అతిపెద్ద నియోజకవర్గమైన చింతలపూడిలో ప్రస్తుత రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ నియోజకవర్గం గతంలో టిడిపికి కంచుకోటగా ఉండేది. 2019 ఎన్నికల్లో వైసిపి ఆ కోటను బద్దలుకొట్టింది. ప్రస్తుతం టిడిపి, జనసేన కలిసి, వైసిపి ఒంటరిగా పోటీ చేస్తోంది. వైసిపిలో అంతర్గత పోరు! వైసిపి అధిష్టానం రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జులను మార్ప చేస్తోంది. ఈ క్రమంలో చింతలపూడి వైసిపి ఇన్‌ఛార్జిని కూడా మార్చే అవకాశం ఉండటంతో ప్రస్తుత ఇన్‌ఛార్జి, సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ ఉన్నమట్ల ఎలిజా గ్రూపు నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గం నుంచి భారీ ర్యాలీగా వెళ్లి మంత్రి మిధున్‌రెడ్డిని కలిసి ఎలిజాకే మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. ఇదిలా ఉంటే ఎంఎల్‌ఎ ఎలిజా సైతం ఇటీవల ఓ ఛానల్‌ ఇంటర్వ్యూలో తనను కొందరు బెదిరిస్తున్నారని, తనపై అధిష్టానం వద్ద తప్పుడు ప్రచారం చేస్తున్నారని, త్వరలో వారిపేర్లు బయటపెడతానని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నియోజకవర్గానికి చెందిన 12 మంది పెత్తందారులు బెదిరిస్తూ, పెత్తనం చలాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. తనను ఎంఎల్‌ఎ అభ్యర్థిగా మరోసారి ప్రకటిస్తే తప్పకుండా ఓడిస్తామని ఆ 12 మంది హైకమాండ్‌ వద్ద చెప్పినట్లు ఎలిజా వివరించారు. ఇలాంటి ప్రచారం వల్ల నియోజకవర్గంలోని వైసిపి నాయకుల, కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయని, బెదిరింపులు ఇలాగే కొనసాగితే వారిపేర్లు బహిరంగంగా బయటపెడతామని హెచ్చరికలుసైతం ఎలిజా చేశారు.అదే విధంగా మరో గ్రూపు నాయకులు మాత్రం ఎలిజ గెలిచినప్పటి నుండి తమను పట్టించుకోలేదని, సీనియర్లను కనీసం పట్టించుకోకుండా, పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కనపెట్టారని ఆరోపిస్తున్నారు. టిడిపి నుండి వైసిపిలోకి వచ్చిన వారికి అధిక ప్రాధాన్యతిస్తున్నారని, కనీసం తమ బాధలు, కష్టాలు, ఇబ్బందులు పట్టించుకోలేదని, ఇప్పుడు టిక్కెట్‌ ఇవ్వకపోవడంతో తమపై బురదజల్లుతున్నారని, సర్వేలు, రిపోర్ట్‌ ఆధారంగానే అధిష్టానం ఇన్‌ఛార్జిని నియమిస్తున్నారని చెప్పుకొస్తున్నారు.వైసిపి ఇన్‌ఛార్జిగా కంభంపాటి విజయరాజు..! కామవరపుకోటకు చెందిన కంభంపాటి విజయరాజును నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నియమిస్తున్నట్లు సమాచారం. రవాణాశాఖ అధికారిగా పనిచేస్తున్న ఆయన ఆప్పటికే తన ఉద్యోగానికి రాజీనామా కూడా చేశారు. నియోజకవర్గంలోని నాయకులను మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకంతో ముందుకు వెళ్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. గత ఎన్నికల్లోనే ఆయన వైసిపి నుండి టిక్కెట్‌ ఆశించారు. ఈసారైనా వస్తుందనే ధీమాతో ఆయన ఉన్నారు. విజయరాజు వియ్యంకుడు శాసన మండలి ఛైర్మన్‌ మోషేన్‌రాజు సహకారం కూడా ఆయనకు ఉండటంతో టిక్కెట్‌ వచ్చే అవకాశం ఉందని ఆయన గ్రూపు నేతలు చెబతున్నారు. అలాగే హోంమంత్రి తానేటి వనిత పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక్కడ విజయానికి అన్ని విధాలుగా ఆలోచించి, బలమైనా అభ్యర్థిని రంగంలోకి దింపాలని అధిష్టనం ఆలోచిస్తున్నట్లు సమాచారం.అదే విధంగా ఎన్‌ఆర్‌ఐ ముప్పిడి సుశీల్‌కు ఎంపీ మిథున్‌ రెడ్డితో మంచి సంబంధాలున్నాయి. దీంతో ఆయనకూడా టిక్కెట్‌ ఆశిస్తున్నవారిలో ఉన్నారు. చింతలపూడి జెడ్‌పిటిసి సభ్యులు మోలుగుమాటి నీరజాసుధాకర్‌, కామవరపుకోట కడిమి రమేష్‌ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అధిష్టానం సర్వే చేయించి బలమైనా అభ్యర్థిని నిలబెట్టే యోచనలో ఉంది.టిడిపి అభ్యర్థి ఎవరు?ప్రతిపక్ష టిడిపి నుంచి టిక్కెట్‌ ఆసిస్తున్నవారి లిస్టు పెద్దగానే ఉంది. వైసిపి విజయరాజుకి ఇస్తే, టిడిపి నుంచి మద్దాల రాజేష్‌ గానీ, మాజీ మంత్రి పీతల సుజాతకు ఇచ్చే యోచనలో టిడిపి ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా బొమ్మాజి అనిల్‌, సొంగా రోషన్‌ కుమార్‌, ఆకుమర్తి రామారావు పేర్లు కూడా టిడిపి అభ్యర్థుల జాబితాలో ఉన్నాయి. వీరిలో రోషన్‌కుమార్‌కు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఆయన గ్రూపు నాయకులు చెబుతున్నారు. నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న బొమ్మాజి అనిల్‌కు తనదైన శైలిలో టిక్కెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. యువగళం పాదయాత్రలో టిడిపికి మంచి క్రేజ్‌ను తీసుకురావడంలో అనిల్‌ కృషి ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈసారి పీతల సుజాతకే..!ఈసారి టిక్కెట్‌ పీతల సుజాతకు ఇచ్చే యోచనలో టిడిపి అధిష్టానం ఉన్నట్లు తెలిసింది. 2019లో టిక్కెట్‌ ఆశించి భంగపడినా, అధిష్టానం నిర్ణయాన్ని కాదనలేదు. అప్పటి నుండి ఆమె పార్టీలో కొనసాగుతూ నియోజకవర్గంలో, జిల్లాలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గాపాల్గొంటూ వస్తున్నారు. 2014లో కాపు సామాజిక తరగతికి పెద్దపిట వేసి బలమైనా నాయకులను తయారుచేసిన ఘనత ఆమెకే దక్కింది. టిడిపి జనసేనపొత్తులో భాగంగా నియోజకవర్గంలో కాపు ఓటింగ్‌ కూడా ఎక్కువగా ఉండటంతో ఆమెకు కలిసివచ్చే అంశం. చింతలపూడి, కొవ్వురు, తిరువూరు నియోజకవర్గాల్లోనైనా టిక్కెట్‌ ఇచ్చే యోచనలో టిడిపి ఉన్నట్లు సమాచారం.అదేవిధంగా జంగారెడ్డిగూడేనికి చెందిన ఆకుమర్తి రామారావు కూడా రేసులో ఉన్నారు. ఆయన చేసిన సేవలు కూడా పరిగణలోకి తీసుకుని టిక్కెట్‌ ఇస్తే ఎలా ఉంటుందోనని అధిష్టానం చర్చిస్తున్నట్లు తెలిసింది.

➡️