రహదారి పూర్తయ్యేదెప్పుడు..?

Mar 1,2024 20:52

ప్రజాశక్తి – వీరఘట్టం : మండలంలోని చిదిమి రహదారి పనులు పూర్తయ్యేదెప్పుడని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. చిదిమి గ్రామ రహదారి నిర్మాణానికి రూ.కోటీ 41 లక్షలు నిధులు మంజూరయ్యాయని గత ఏడాది జులై 21న స్థానిక ఎమ్మెల్యే వి.కళావతి, ఎమ్మెల్సీ పి.విక్రాంత్‌ అప్పట్లో అట్టహాసంగా భూమి పూజ చేశారు. నిధులు మంజూరు కాకపోవడంతో కొంతకాలంగా పనులు ప్రారంభించలేదు. ఎట్టకేలకు ఉపాధిహామీ నిధులు కోటీ 20 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయి. ఈ పనులు సీతంపేట ఐటిడిఎ పర్యవేక్షణలో ఉపాధిహామీ చట్టం ద్వారా నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. సీఎస్పీ రహదారి నుండి చిదిమి రోడ్డు వరకు ఇరువైపులా జెసిబితో మట్టి పనులు చేపట్టారు. రోడ్డు పూర్తిగా తవ్వకాలు జరిపి వాటి పైన 40 ఎంఎం చిప్స్‌ వేసి రోలింగ్‌ చేసి అర్ధాంతరంగా నిలిపివేశారు. దీంతో రాళ్లురేలిన రోడ్డుపై రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు నిర్మాణ పనులు చేపట్టి దాదాపుగా ఎనిమిది నెలలు కా వస్తున్నా పనుల్లో పురోగతి లేకపోవడంతో స్థానికులు విమర్శిస్తున్నారు. చిదిమి రహదారి నిర్మాణ పనులు, వీరఘట్టం ప్రధాన రహదారి విస్తీర్ణం అభివృద్ధి పనులు చేపట్టిన గుత్తేదారు ఒక్కరే కావడం గమనార్హం. స్థానిక ఎంపిపి గ్రామానికి వెళ్లే రహదారి నిర్మాణ పనులు ఉంటే మరి పల్లెల గురించి వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయమై ఎపిఒ వై.సత్యం నాయుడు వద్ద ‘ప్రజాశక్తి’ వివరణ కోరగా ఇప్పటి వరకు జరిగిన పనులకు సంబంధించి రూ.27 లక్షల వరకు రికార్డు చేశామని, ఉన్నతాధికారి ఆమోదం తెలిపితే వెంటనే నిధులు గుత్తేదారుకు చెల్లించి పనులు ప్రారంభిస్తామని తెలిపారు.

➡️