రాజకీయ బదిలీల రద్దు చేయాలి : యుటిఎఫ్‌

ప్రజాశక్తి – కడప అర్బన్‌ ఉపాధ్యాయులు పోరాటాల ద్వారా సాధించుకున్న కౌన్సెలింగ్‌ విధానాన్ని అపహాస్యం చేస్తూ ప్రభుత్వమే సిఫార్సు బదిలీలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, వెంటనే ప్రభుత్వ సిఫార్సు బదిలీలను రద్దు చేయాలని యుటియఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీ రాజా, జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్‌ బాబు డిమాండ్‌ చేశారు. అక్రమ బదిలీలు ఆపాలంటూ డిఇఒ కార్యాలయం ఎదుట యుటిఎఫ్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరీక్షలు జరుగుతున్న సమయంలో ఈ విధంగా సిఫార్సు బదిలీలు చేయడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుందా అని ప్రశ్నించారు. మున్సిపల్‌ ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు, హిందీ, తెలుగు పండిట్ల ప్రమోషన్లు, వివిధ జిల్లాలలో పెండింగ్‌లో ప్రమోషన్లు ఇవ్వటానికి నిబంధనలు ఆటంకంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారని, మరి కౌన్సిలింగ్‌తో సంబంధం లేకుండా సిఫార్సు బదిలీలు చేయడానికి ఏ నిబంధనలు ఆటంకం కావడంలేదా అని ప్రశ్నించారు. ఉపాధ్యాయుల కోరిక మేరకే బదిలీలు చేస్తున్నామని ప్రభుత్వం బూటకపు మాటలు చెబుతోందని పేర్కొన్నారు. అదే ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు వద్దని చెబుతున్న జిఒ నంబరు117, అప్రెంటీస్‌ విధానాన్ని ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. సుమారు 1200పైగా ప్రభుత్వం సిఫార్సు బదిలీలు చేయడం విద్యారంగానికి మాయని మచ్చగా మిగిలిపోతుందని విమర్శించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్వహించే కౌన్సెలింగ్‌ విధానానికి తూట్లు పొడిచే ప్రభుత్వ సిఫార్సు బదిలీలు వెంటనే రద్దు చేయాలని, లేకుంటే ప్రభుత్వం తగు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా సహాధ్యక్షురాలు సుజాత రాణి, జిల్లా కార్యదర్శి సి.వి. రమణ, రాష్ట్ర కౌన్సిలర్‌ రూతు ఆరోగ్య మేరీ, సిడిపి ప్రత్యూష, ఆడి కమిటీ కన్వీనర్‌ ప్రభాకర్‌, నాయకులు కేదార్నాథ్‌, బత్తుల చంద్రశేఖర్‌, సిద్దయ్య, జి. వెంకటసుబ్బయ్య, మజ్జారి చెన్నకేశవులు, కిరణ్‌ కుమార్‌, సుబ్బారావు, శ్రీకాంత్‌, శివ శంకర్‌, బాబు, శంకర్‌ రెడ్డి, పాల్గొన్నారు.

➡️