రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక

ప్రజాశక్తి – గిద్దలూరు : గిద్దలూరుకు చెందిన ఏడుగురు బాల,బాలికలు రాష్ట్ర స్థాయి టెన్నిస్‌ పోటీలకు ఎంపికయ్యారు. గతేడాది యూత్‌ స్పోర్ట్స్‌ రిక్రియేషన్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో బాల,బాలికల రాష్ట్రస్థాయి టెన్నిస్‌ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 1073 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అందులో 50 మందిని రాష్ట్ర స్థాయిలో పోటీలకు ఎంపిక చేశారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన వారిలో గిద్దలూరుకు చెందిన భావనాదేవి, సనాకౌసర్‌, యశోదాదేవి, చంద్రమౌళి, నాగ్‌,సాహెల్‌, కుర్షిద్‌ ఉన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులను జిల్లా లాన్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ మోహన్‌ రెడ్డి అభినందించారు. క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించి సోదర భావంతో టెన్నిస్‌ క్రీడలో మరింత ప్రతిభ ప్రదర్శించి గిద్దలూరుకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో టెన్నిస్‌ కోచ్‌ మురళీ మోహన్‌రెడ్డి, విశ్వభారతి స్కూల్‌ కరస్పాండెంట్‌ రంగస్వామి రెడ్డి, అసోసియేషన్‌ కార్యదర్శి రాఘవులు, టెన్నిస్‌ అసోసియేషన్‌ సభ్యులు, క్రీడాకారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

➡️