రెండు నెలలు దాటుతున్నా దక్కని పరిహారం

Mar 20,2024 22:06

 సమావేశంలో మాట్లాడుతున్న జొన్న శివశంకరరావు
ప్రజాశక్తి – తాడేపల్లి రూరల్‌ :
మండల కేంద్రమైన దుగ్గిరాలలోని శుభం మహేశ్వరి కోల్డ్‌ స్టోరేజీలో జనవరి 19న అగ్ని ప్రమాదం వాటిల్లగా పసుపు పంట దగ్ధమైన ఘటనలో బాధిత రైతులకు సత్వరమే న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ పసుపు రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్‌ జొన్న శివశంకరరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బాధితుల సమావేశం వడ్డేశ్వరం కేబీ భవన్‌లో ఆంధ్రప్రదేశ్‌ పసుపు రైతుల సంఘం, అగ్ని ప్రమాద బాధితుల రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం జరిగింది. సమావేశానికి బాధిత రైతుల సంగం కన్వీనర్‌ వేములపల్లి వెంకటరామయ్య అధ్యక్షత వహించారు. జొన్న శివశంకరరావు మాట్లాడుతూ ప్రమాదం జరిగి రెండు నెలలు దాటుతున్నా యాజమాన్యం గాని, ప్రభుత్వంగాని, అధికారులు గాని న్యాయం చేయలేదన్నారు. వాస్తవ రైతులను ప్రభుత్వం గుర్తించకపోగా, నష్టపరిహారం కూడా చెల్లించలేదని మండిపడ్డారు. ప్రమాద బీమాను రైతులకు వర్తింపజేసేలా జాయింట్‌ కలెక్టర్‌ చర్యలు చేపట్టాలన్నారు. వ్యవసాయ రంగం ఇప్పటికే సంక్షోభంలో కూరుకుపోయి, రైతులు అప్పులు పాలవుతున్నారని గుర్తు చేశారు. రూ.లక్షల పెట్టుబడులు పెట్టి, పంటను ధరొచ్చాక అమ్ముకోవడానికి కోల్డ్‌ స్టోరేజీలో నిల్వ చేసుకొని, అద్దెలు కట్టలేక రైతులు సతమతం అవుతున్నారని చెప్పారు. రైతుల కష్ట, నష్టాలను అధికారులు, ప్రభుత్వం గుర్తించాలని, బాధితులను ఆదుకునేందుకు ప్రస్తుత పసుపు ధర ప్రకారం నష్ట పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య, న్యాయవాది కొండూరు వీరయ్య, మేధావి రవికుమార్‌, రైతు సంఘం గుంటూరు జిల్లా సహాయ కార్యదర్శి కె.వెంకటేశ్వరరావు, బాధిత రైతుల సంఘం కో-కన్వీనర్‌ ఎం.శివసాంబిరెడ్డి, రామస్వామి, రైతు సంఘం నాయకులు డి.వెంకటరెడ్డి పాల్గొన్నారు.

➡️