రెండో విడతలో మరో నలుగురు

Mar 14,2024 23:06

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేయనున్న అభ్యర్థులకు సంబంధించి రెండో విడత విడుదల చేసిన జాబితాలో మరో నలుగురి పేర్లు ఖరారు చేశారు. వీరిలో గురజాల నుంచి మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, గుంటూరు పశ్చిమ నుంచి డాక్టర్‌ పిడుగురాళ్ల మాధవి, గుంటూరు తూర్పు నుంచి నశీర్‌ అహ్మద్‌, పెదకూరపాడు నుంచి భాష్యం ప్రవీణ్‌కు అవకాశం కల్పించారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 17 స్థానాల్లో తెనాలి నుంచి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ పోటీ చేస్తున్నారు. మిగతా 16 స్థానాల్లో టిడిపి పోటీ చేస్తుంది. టిడిపి, జనసేన, బిజెపి పొత్తున్నా జిల్లాలో బిజెపికి ఒక్క సీటు దక్కలేదు. గుంటూరు పశ్చిమపై పలువురు బిజెపి నాయకులు ఆశలు పెట్టుకున్నా ఫలించలేదు. గుంటూరు తూర్పు, పశ్చిమ స్థానాల్లో ఒకటి జనసేనకు కేటాయిస్తారని ఆ పార్టీ నాయకులు ఆశించినా వారికీ నిరాశే మిగిలింది. టిడిపిలో సీనియర్లు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌, కొమ్మాలపాటి శ్రీధర్‌, కోవెలమూడి రవీంద్రకు ఎక్కడా స్థానం కల్పించలేదు. తనకే పెదకూరపాడు సీటు వస్తుందని భావించిన కొమ్మాలపాటి శ్రీధర్‌ అవకాశం ఇవ్వకపోవడంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. నారా లోకేష్‌ తన అనుచరుడిగా కొమ్మాలపాటికి అవకాశం కల్పించారనే ప్రచారం ఉంది. మరోవైపు నరసరావుపేట అభ్యర్థి ఎంపికపై ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి అవకాశం ఇవ్వాలని నర్సరావుపేట ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయులు కోరినా అధిష్టానం స్పష్టతివ్వలేదు. నర్సరావుపేట లోక్‌సభకు వైసిపి నుంచి అనిల్‌కుమార్‌ యాదవ్‌ను ఎంపిక చేయడంతో పల్నాడు జిల్లాలో ఒక్క అసెంబ్లీ స్థానమైనా యాదవ సామాజిక తరగతికి ఇవ్వాలని లావు శ్రీకృష్ణదేవరాయులు పట్టుబడుతున్నారు. ఈ అంశంపై శ్రీకృష్ణదేవరాయులుతో జంగా గురువారం ఉదయం సమావేశమయ్యారు. అయితే ఆరేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న టిడిపి నర్సరావుపేట ఇన్‌ఛార్జి అరవిందబాబుకు అవకాశం ఇవ్వకపోతే పార్టీలో క్యాడర్‌కు తప్పుడు సంకేతాలు వెళతాయనే భావనతో ఈ సీటు పెండింగ్‌లో పెట్టారు. ఈ సీటును బిసిలకే ఇవ్వాలని దాదాపుగా నిర్ణయర తీసుకున్నా ఎవరికి కేటాయిస్తారన్నదీ స్పష్టత రాలేదు. వైసిపి ఇప్పటికే నలుగురు మహిళలకు అవకాశం ఇవ్వగా టిడిపి అనివార్యంగా గుంటూరు పశ్చిమ నుంచి మాధవిని ఎంపిక చేసింది. అయితే ఉమ్మడి గుంటూరు జిల్లాలో అసెంబ్లీ స్థానాల్లో వైసిపి ముగ్గురు కాపులకు అవకాశం ఇవ్వగా టిడిపి సత్తెనపల్లి ఒక్కటే కేటాయించింది. గుంటూరు లోక్‌సభకు వైసిపి నుంచి కిలారి రోశయ్యను ఎంపిక చేయడంతో కాపుల్లో అసంతృప్తి ఏర్పడింది.

➡️