రేపటి బంద్‌, సమ్మెను జయప్రదం చేయండి

Feb 14,2024 23:25

ప్రచారంలో పాల్గొన్న సిపిఎం, సిపిఐ, ప్రజా సంఘాల నాయకులు
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాల ఐక్యవేదిక, సంయుక్త కిసాన్‌ మోర్చ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగే గ్రామీణ బంద్‌, పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయాలని సిపిఎం, సిపిఐ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలో బుధవారం ప్రచారం చేశారు. సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరుకుమార్‌ మాట్లాడుతూ ఎన్నికల నాటి హామీలను విస్మరించిన బిజెపి మొత్తంగా దేశ ప్రజలను మోసం చేసిందని అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ మొదలుకొని వ్యవసాయం, పరిశ్రమలు, గనులు, విద్యుత్‌, అటవీ సంపదలను, రవాణా, ఎల్‌ఐసి, బ్యాంకులను తదితర సంస్థలను అదాని, అంబానీ వంటి కార్పొరేట్లకు కట్టబెట్టడానికి పూనుకుందని, కార్పొరేట్‌ కంపెనీల లాభాలకు ఆటంకంగా ఉన్న కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్‌ కోడ్‌లు తెచ్చిందని మండిపడ్డారు. ప్రొఫెసర్‌ స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులు అమలు చేసి వ్యవసాయ రంగాన్ని కాపాడాల్సి ఉండగా ఆ రంగాన్ని కూడా కార్పొరేటీకరి ంచేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శిం చారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా ఐక్యమై నష్టదాయకమైన ఈ విధానాలను తిప్పికొ ట్టాలని, అందులో భాగంగా జరిగే బంద్‌, సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో బిజెపిని గద్దె దింపాలన్నారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు కె.రామారావు, డి.శివకుమారి, టి.పెద్దిరాజు, సిలార్‌ మసూద్‌, కె.రాంబాబు, యు.రంగయ్య, వి.వెంకట్‌, షేక్‌ చిన్నజాను సైదా, కె.శ్రీను పాల్గొన్నారు.

➡️