రైతులకు సత్వరమే పరిహారమివ్వాలి

సమావేశం మాట్లాడుతున్న వి.కృష్ణయ్య
ప్రజాశక్తి-సత్తెనపల్లి :
మిచౌంగ్‌ తుపానుతో పంటలు నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం ఇవ్వాలని, వర్షాభావం వల్ల పంటలు సాగు చేయని రైతులకు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సిపిఎం పల్నాడు జిల్లా విస్తృత సమావేశం బుధవారం నిర్వహించారు. సమావేశానికి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.రాధాకృష్ణ అధ్యక్షత వహించగా కృష్ణయ్య మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో కలెక్టర్‌ గుర్తించిన 17 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి, అందుకనుగుణంగా సాయం చేయాలని కోరారు. ఈ మేరకు తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది. సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్‌ మాట్లాడుతూ అసంఘటిత రంగ కార్మికులు, స్కీం వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని, అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని అన్నారు. భవనిర్మాణ కార్మికుల సంక్షేమం బోర్డు నిధులు మొత్తం దారి మళ్లించిందని మండిపడ్డారు. ఆ నిధులను వెంటనే సంక్షేమ బోర్డుకు జమ చేసి భవన నిర్మాణ కార్మికుల క్లైమూలకు రావాల్సిన డబ్బులను చెల్లించాలని, సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలను కార్మికులకు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్ట్‌, పర్మినెంట్‌ ఉద్యోగులకు ఈ నెల జీతాలింకా చెల్లించలేదని, దీంతో ఆ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని చెప్పారు. కస్తూర్బా పాఠశాల ఉద్యోగులకు మూణ్ణెల్లుగా వేతనాలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలుమార్లు శంకుస్థాపన చేసిన వరికపూడిశెలకు సత్వరమే నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. సత్తెనపల్లికి బైపాస్‌ రోడ్డు రావడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే బైపాస్‌ రోడ్‌లో భూములు కోల్పోయిన రైతులకు 2013 భూ సేకరణ చట్టం ద్వారా పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. నరసరావుపేట పట్టణాన్ని పల్నాడు జిల్లా కేంద్రంగా ప్రకటించినా ప్రభుత్వ కార్యాలయాల అధికారాలన్నీ గుంటూరులోనే ఉన్నాయని, వెంటనే ఆయా కార్యాలయాలను, అధికారులను, నిధులు, విధులు కేటాయించి నరసరావుపేట పట్టణాన్ని జిల్లా కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరారు. సమావేశంలో సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎ.లకీëశ్వరరెడ్డి, ఎవిఎన్‌ గోపాలరావు, ఎస్‌.ఆంజనేయ నాయక్‌, సీనియర్‌ నాయకులు గద్దె చలమయ్య, నాయకులు జి.బాలకృష్ణ, జి.మల్లీశ్వరి, డి.శివకుమారి, డి.విమల, పి.మహేష్‌, టి.పెద్దిరాజు, జి.ఉమశ్రీ పాల్గొన్నారు.

➡️