రైతులను అప్రమత్తం చేయండి : ఎమ్మెల్యే

Dec 5,2023 21:12

ప్రజాశక్తి-గజపతినగరం, బొండపల్లి  :  మిచౌంగ్‌ తుపాన్‌ ప్రభావం దృష్ట్యా తలెత్తే పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని, ఈ మేరకు పక్కా ప్రణాళిక తో ముందుకు వెళ్లాలని అధికారులను గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఆదేశించారు. మంగళవారం గజపతినగరం తహశీల్దార్‌ కార్యాలయంలోను, బొండపల్లి ఎంపిడిఒ కార్యాలయంలోను అధికారులు, వైసిపి నాయకులతో సమావేశం నిర్వహించారు. బొండపల్లి ఎంపిపి చల్ల చలంనాయుడు ఛాంబర్లో అధికారులతో తుపాను ప్రభావంపై చర్చించారు. తుపాను ప్రభావం వల్ల గ్రామాల్లో రైతులను అప్రమత్తం చెయ్యాల్సిన అవసరం ఉందన్నారు. అధిక వర్షపాతం, ఈదురుగాలుల పట్ల రైతాంగానికి నిరంతరం సూచనలు సలహాలు చేయాలని వ్యవసాయ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. సహాయక చర్యలు చేపట్టేందుకు అనువుగా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసారా అని తహశీల్దార్‌ ప్రసాద్‌ రావును ఎమ్మెల్యే ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లు యజమానులు రైతుకు పూర్తి సహకారం అందించేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ జెడి. వి.తారకరామారావుకు సూచించారు. సహాయక చర్యల్లో పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొనేలా చూడాలని ఎంపిపి చలం నాయుడు, వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షులు బొద్దల చిన్నంనాయుడును ఆదేశించారు. 2003 సంవంత్సరానికి ముందు డి-పట్టాకు సంబంధించి సాగు అనుభవంలో ఉన్న రైతులకు పట్టాలు ఇవ్వడం జరుగుతుందని,అర్హులను గుర్తించాలని తహశీల్దార్‌ ప్రసాద్‌ రావును ఆదేశించారు. సమావేశంలో ఎడిఎ కె.మహారాజన్‌, ఎంపిడిఒ వైవి రాజేంద్ర ప్రసాద్‌, వ్యవసాయ అధికారి మల్లికార్జున రావు, ఎంఇఒ శోభారాణి, ఎంఇఒ-2 అల్లు వెంకటరమణ, ట్రాన్స్‌కో ఎఇ శంకర్‌ రావు , ఎపిఒ బి.కృష్ణవేణి, ఎంపిటిసి శ్రీనివాస రావు, ఉపసర్పంచ్‌ కెవి.రమణ, జగదీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మిచౌంగ్‌ తుపాను పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలపై ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య గజపతినగరంలో సమీక్ష చేశారు. తుపాను పట్ల తీసుకున్న జాగ్రత్తలపై అధికారులను ఆరా తీశారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి ఆవాసం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తుపాను వలన నష్టపోయిన రైతులు ఎవరు అధైర్య పడవద్దని, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు. తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్ముకునే వీలు ప్రభుత్వం కలుగ చేసిందని అన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ ఎం.అరుణకుమారి, ఎంపిడిఒ కె.కిషోర్‌ కుమార్‌, వైసిపి మండల అధ్యక్షులు బూడి వెంకటరావు, పురిటిపెంట ఉప సర్పంచ్‌ మండల సురేష్‌, కర్రి రాము నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

➡️