వాలంటీర్లంటే బాబుకు ఎందుకంత భయం

Mar 26,2024 21:34

ప్రజాశక్తి- గజపతినగరం: వాలంటీర్లు అంటే టిడిపి అధినేత చంద్రబాబు ఎందుకంత భయపడుతున్నారని స్థానిక ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య ప్రశ్నించారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాలంటీర్లు విషయంలో చంద్రబాబు రెండు నాలుకల ధోరణి అవలంబిస్తున్నారని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లు తొలగిస్తామని ఒకసారి, మరోసారి తొలగించమని, అంతలోనే మంచి జీతాలు ఇస్తామని అంటూ రోజుకో మాట చంద్రబాబు నోట వినిపిస్తుందని హేళన చేశారు. వాలంటీర్ల ఓట్లను కోల్పోతామేమో నన్న భయంతో చంద్రబాబు ఈ విధంగా మాట్లాడుతున్నారని దుయ్య బట్టారు. నిరంతరం ప్రజలకు సేవలు అందించే వాలంటీర్లు జోలికి వస్తే ప్రజా విశ్వాసాన్ని కోల్పోతామని చంద్రబాబు గ్రహించి తన రూటు మార్చారన్నారు. ఈ ఐదేళ్ల కాలంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలులో వాలంటీర్లు ఎంతో నిబద్ధతతో పని చేశారన్నారు. ఈ సమావేశంలో వైసిపి మండల అధ్యక్షుడు బూడి వెంకటరావు, సర్పంచ్‌ బెల్లాన త్రినాధ, ఉప సర్పంచులు మండల సురేష్‌, కర్రీ రామ్‌ నాయుడు, జెసిఎస్‌ కన్వీనర్‌, కనకల సుబ్రహ్మణ్యం, కర్రీ నానాజీ, ఆల్తి గణపతి, మండల లక్ష్మనాయుడు, గొర్ల సత్యం, అప్పలనాయుడు పాల్గొన్నారు.కొత్తవలస: సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో కీలకంగా ఉన్న వాలంటీర్లపై ప్రతిపక్ష నేతలు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు హేయమైన చర్య అని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం సాయంత్రం గొల్లపేట, కాటకాపల్లి, చినరావుపల్లి గ్రామాల్లో ఇంటింటి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల ముంగిటికే తీసుకుని వెళుతున్న వాలంటీర్‌ వ్యవస్థ అద్భుతమైన పనితీరును కనపరచడంతో ప్రతిపక్షంలో గుబులు రేగుతోందన్నారు. అందుకే వాలంటీర్లపై గంటకో మాటను మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కొప్పల్‌ వెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌ నెక్కల నాయుడు బాబు, ఎంపిపి నీలంశెట్టి గోపమ్మ, జెడ్‌పిటిసి నెక్కల శ్రీదేవి, వైసిపి మండల అధ్యక్షుడు ఒబ్బిన నాయుడు, పిఎసిఎస్‌ అధ్యక్షుడు గొరపల్లి శివ, కాటకాపల్లి సర్పంచ్‌ పీతల కృష్ణ, చినరావుపల్లి సర్పంచ్‌ బోసాల దేవుడు, తదితరులు పాల్గొన్నారు.

➡️