వాహనం ఢకొీని యువకుడు మృతి

Feb 21,2024 21:20

ప్రజాశక్తి- డెంకాడ : మండలంలోని పినతాడివాడ సమీపంలో బొలెరో వాహనం ఢకొీని యువకుడు మృతి చెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. పినతాడివాడ గ్రామానికి చెందిన మజ్జి లక్ష్మణరావు (18) తన స్నేహితుడు బమ్మిడి వాసు ఇద్దరు కలిసి మోటార్‌ సైకిల్‌ పై జొన్నాడలో జరుగుతున్న పైడితలమ్మ జాతరకు పినతాడివాడ నుంచి గొడ్డుపాలెం మీదగా వెళుతున్నారు. గొడ్డిపాలెం నుంచి పిన తాడివాడ వైపు ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని బొలెరో వాహనం, మోటార్‌ సైకిల్‌ బలంగా ఢకొీన్నాయి. దీంతో లక్ష్మణరావుకు తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన వాసుకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే 108 ద్వారా విజయనగరం ఆసుపత్రికి తరలించారు. వచ్చే నెల 22న తన పెద్దమ్మ కూతురు వివాహం ఉండగా ముందే చేతికి అందిన ఒక్కగాని ఒక కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడు లక్ష్మణరావు ఐఐటి చదువుతు న్నట్లు పోలీసులు చెబుతున్నారు.వాహనాలపై చర్యలు తీసుకోవాలిటోల్గేట్‌ను తప్పించుకోవడానికి వాహనాలు అడ్డదారిలో రావడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతు న్నారు. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న వాహనాలకు నాతవలస జాతీయ రహదారిపై టోల్‌గేట్‌ కట్టాల్సి వస్తుందని వాహనదారులు చాలా మంది అడ్డదారుల గుండా గ్రామాల్లో వచ్చి ఇలాంటి ప్రమాదా లకు కారణమవుతున్నారని చెబుతున్నారు. శ్రీకాకుళం నుంచి విశాఖ వెళ్లాలన్నా, విశాఖ నుంచి శ్రీకాకుళం వెళ్లాలన్నా జాతీయ రహదారి సవరవిల్లివద్ద నుంచి పిన తాడివాడ మీదగా విజయనగరం నాతవలస రోడ్డు నుంచి జాతీయ రహదారి మీదకు వెళ్లిపోతున్నారు. దీంతో టోల్గేట్‌లో డబ్బులు కట్టనవసరం లేదని ఈ రహదారి గుండా చిన్న వాహనాలతో పాటు భారీ వాహనాలు కూడా వస్తున్నాయని అటువంటి వాహనాలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

➡️