విజిల్స్‌ వేస్తూ వినూత్న నిరసన

Dec 24,2023 23:42

ప్రజాశక్తి – యంత్రాంగం

తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సమ్మెకు దిగిన అంగన్‌వాడీలు రోజుకో రీతిలో తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం నాటికి అంగన్‌వాడీల సమ్మె 13వ రోజుకు చేరింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిగిన నిరసన శిబిరాల్లో అంగన్‌వాడీలు ఈళలు వేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో ఒంటికాలిపై నిల్చుని నినదించారు.

పెద్దాపురం స్థానిక మున్సిపల్‌ సెంటర్‌లో నిర్వహిస్తున్న సమ్మె శిబిరం వద్ద అంగన్‌వాడీలు విజిల్స్‌ ఊదుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీలు రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి సమస్యలను పరిష్కరించాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. మాజీ కౌన్సిలర్‌, ఐద్వా నాయకులు కూనిరెడ్డి అరుణ అంగన్‌వాడీల ఉద్యమానికి మద్దతు పలికారు.ఈ కార్యక్రమంలో యూనియన్‌ కార్యదర్శి దాడి బేబీ, ఎస్తేరురాణి, నాగమణి, అమల, టిఎల్‌.పద్మావతి, కాలే దేవి, జె.కుమారి, జ్యోతి, లోవతల్లి, వసంతకుమారి, వెంకటలక్ష్మి, నాగమణి, సావిత్రి, రత్నం, లక్ష్మి, లోవ కుమారి, మహాలక్ష్మి, మంగాలక్ష్మి, రజని, స్నేహలత తదితరులు పాల్గొన్నారు.

కాకినాడ నగరంలోని కలెక్టరేట్‌ సమీపంలో చేపట్టిన నిరసన శిబిరంలో జరిగిన ధర్నాలో తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ ధర్నాను యూనియన్‌ జిల్లా కోశాధికారి జి.రమణమ్మ ప్రారంభించారు. సిఐటియు జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ, సిఐటియు జిల్లా నాయకులు మేడిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ అంగన్‌వాడీల కష్టాన్ని ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. క్షేత్రస్థాయిలో వారు చేస్తున్న సేవలను గుర్తించి వారికి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఫుడ్‌ కమిషనర్‌ విద్యా ప్రతాపరెడ్డి అంగన్‌వాడీలపై చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు విజయ, జోగంబ, దీప్తి, రమ, మున్ని, సత్యవేణి, నీరజ, జ్యోతి, సరోజ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

కరప స్థానికంగా జరుగుతున్న అంగన్‌వాడీల దీక్షా శిబిరంలో ఒంటి కాలిపై నిల్చుని నిరసనను వ్యక్తం చేశారు. ఈ శిబిరాన్ని మాజీ ఎంఎల్‌ఎ పిల్లి అనంతలక్ష్మి సత్తిబాబు దంపతులు, మాజీ ఎంపిపి గుళ్ళుపల్లి శ్రీనివాసరావు, నాయకులు చాట్రా ఇమానీలు, మద్దూరు స్వామి, కాకర్ల బుజ్జిబాబు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు పి.వీరవేణి, ఎస్‌.వరలక్ష్మి, ఎస్‌ఎస్‌.కుమారి, దైవకుమారి, అచ్చారత్నం, తదితరులు పాల్గొన్నారు.

కిర్లంపూడి స్థానిక తహశీల్దార్‌ కార్యాలయ సమీపంలో జరుగుతున్న అంగన్‌వాడీల నిరసన శిబిరంలో రిలే నిరహారదీక్షను కొనసాగించారు. తమ సమస్యలను పరిష్కరించే వరకూ సమ్మెను విరమించేది లేదని తేల్చిచెప్పారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు సిహెచ్‌.రత్నం, పి.సావిత్రి, షేక్‌ పరివిన్‌, జి.రత్నం, పి.మంగాయమ్మ, పి.ప్రభావతి, హసీనా బేగం తదితరులు పాల్గొన్నారు. జగ్గంపేట రూరల్‌ స్థానికంగా జరుగుతున్న అంగన్‌వాడీల నిరసన శిబిరాన్ని మండల యుటిఎఫ్‌ నాయకులు సందర్శించి సంఘీభావం తెలిపారు. నిమ్మ రసం ఇచ్చి ఆదివారం దీక్ష ను విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ నాయకులు ఆది సత్యనారాయణ, మధు, యూనియన్‌ నాయకులు రత్నం, సుజాత, తదితరులు పాల్గొన్నారు.

ఏలేశ్వరం స్థానికంగా జరుగుతున్న అంగన్‌వాడీల నిరసన శిబిరాన్ని యుటిఎప్‌ జిల్లా నాయకులు జి.వీరబాబు సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీల సెక్టర్‌ అధ్యక్షురాలు కాకరపల్లి సునీత మాట్లాడుతూ మహిళలు 13 రోజులుగా రోడ్లెక్కి ఆందోళనలు నిర్వహిస్తున్న సిఎం జగన్‌కు చీమకుట్టినట్టైనా లేదన్నారు. ఎన్నికలకు ముందు నా అక్కలు చెల్లెమ్మలు అన్నా ఆయన నేడు తమ సమస్యలను పరిష్కరించమంటే ఏమాత్రం స్పందించడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు ఎన్‌.అమలావతి, సిహెచ్‌.వెంకటలక్ష్మి, జె.రాణి, పి.నూకరత్నం, ఆర్‌. రత్నకుమారి, పి.దుర్గాసూర్యకుమారి, కె.రమ్య, పి.గంగాభవాని, కె.బంగారు పాప తదితరులు పాల్గొన్నారు.

తాళ్లరేవు స్థానికంగా జరుగుతున్న అంగన్‌వాడీల రిలే నిరహారదీక్షలు కొనసాగాయి. ఈ దీక్షా శిబిరాన్ని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కెఎస్‌.శ్రీనివాస్‌, టేకుమూడి ఈశ్వరరావు సంఘీభావం తెలిపారు. అంగన్‌వాడీల సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు ఆదిలక్ష్మి, ప్రజా సంఘాల నాయకులు తణుకు రాంబాబు, మందనక్క తణుకు రాజు తదితరులు పాల్గొన్నారు.

➡️