వితంతువుపై కత్తితో దాడి

ఆపై పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం

ప్రజాశక్తి – ఉంగుటూరు

చేబ్రోలులో ఆదివారం పొలంలో వరినాట్లు వేస్తున్న వితంతువు ధనలక్ష్మిపై భీమయ్య అనే వ్యక్తి కత్తితో దాడి చేసి, తరువాత అతను కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నారాయణపురం ఎన్‌టిఆర్‌ కాలనీకి చెందిన ధనలక్ష్మి భర్త చనిపోయాడు. కూలీ పనులు చేస్తూ జీవిస్తోంది. ఈక్రమంలో అదే గ్రామానికి చెందిన బోడిగడ్ల భీమయ్యకు భార్య లేదు. దీంతో ఇరువురు కొంత కాలం నుంచి సన్నిహితంగా ఉంటున్నారు. దరిమిలా వారిద్దరి మధ్య ఏవో మనస్ఫర్థలు వచ్చినట్లు స్థానికులు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ధనలక్ష్మి చేబ్రోలులో పొలం పనులు చేస్తుండగా కత్తితో దాడి చేసి, వెంట తెచ్చుకున్న పురుగుల మందును భీమయ్య తాగేశాడు. దీంతో ఇద్దరినీ 108 అంబులెన్సులో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని, కేసు దర్యాప్తు చేస్తున్నామని చేబ్రోలు ఎస్‌ఐ ఎ.మణికుమార్‌ వెల్లడించారు.

➡️