విద్యార్థుల్లో ప్రతిభతకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదం

ప్రజాశక్తి – భీమడోలు

విద్యార్థుల్లో నిబిడీకృతమై ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలు సహకరిస్తాయని భీమడోలు మండల విద్యాధికారి నెంబర్‌-1 శ్రీనివాసరావు అన్నారు. భీమడోలు హై స్కూల్‌ వేదికగా మండలస్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన 2023-24 కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంధానకర్తగా ఉపాధ్యాయుల మండే సుధాకర్‌ వ్యవహరించారు. ప్రదర్శనలలో భీమడోలు మండల పరిధిలోని ఆరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలు, రెండు ప్రాథమిక ఉన్నత పాఠశాలలు, బిఆర్‌.అంబేద్కర్‌ గురుకులం పొలసానిపల్లికి చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. 45 అంశాలపై విద్యార్థులు తయారుచేసిన పలు అంశాలను ప్రదర్శనకు ఉంచారు. వీటిలో కొన్నింటిని ఉపాధ్యాయులు తయారు చేశారు. న్యాయ నిర్ణేతలుగా మండల విద్యాధికారితో పాటు భీమడోలు హై స్కూల్‌ ప్రధానోపాధ్యాయులు బి.శ్రీనివాసరావు, శ్రీవెంకటేశ్వర డిగ్రీ కళాశాలకు చెందిన అధ్యాపకులు పవన్‌కుమార్‌ పాల్గొన్నారు. ప్రదర్శనలో ఏడు సబ్జెక్టులకు చెందిన అంశాలను ప్రదర్శించారు. వీటినుంచే టీచర్‌ ఎగ్జిబిట్‌, విద్యార్థుల వ్యక్తిగత ఎగ్జిబిట్‌, విద్యార్థుల గ్రూప్‌ ఎగ్జిబిట్‌ అంశాల వారీగా మండల స్థాయి విజేతలను ఎంపిక చేశారు. వీరు జిల్లాస్థాయి ప్రదర్శనలకు హాజరు కావలసి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన భీమడోలు హై స్కూల్‌ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన వల్ల విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుందని, పలు అంశాలను నేర్చుకోవాలన్న జిజ్ఞాస కలుగుతుందని వివరించారు. అనంతరం ప్రదర్శన విజేతలుగా నిలిచిన భీమడోలు హైస్కూల్‌ ఉపాధ్యాయురాలు ఎండి హసీనా బేగం తయారుచేసిన రొటేషనల్‌ కెమిస్ట్రీ, గుండుగొలను హైస్కూల్‌ ఉపాధ్యాయురాలు ఎల్‌.రమాదేవి తయారు చేసిన ఔషధ మొక్కల ఉపయోగాలు అంశాలు ప్రథమ, ద్వితీయ స్థానాలను దక్కించుకున్నాయి. విద్యార్థుల వ్యక్తిగత ఎగ్జిబిట్‌ ప్రదర్శన ఆగడాలలంక హై స్కూల్‌కి చెందిన విద్యార్థి తయారు చేయగా బ్రౌత్‌ అనలైజర్‌ ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. విద్యార్థుల గ్రూప్‌ ఎగ్జిబిట్‌లో గుండుగొలను హైస్కూల్‌ విద్యార్థులు బి.రాజేష్‌, జి.హర్షిత తయారు చేసిన సేంద్రియ వ్యవసాయ విధానం ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నాయి. విజేతలకు భీమడోలు హైస్కూల్లో గురువారం నిర్వహించే కార్యక్రమానికి హాజరుకానున్న ఎంఎల్‌ఎ వాసుబాబు చేతుల మీదుగా ప్రోత్సాహక బహుమతి చేస్తామని నిర్వాహకులు తెలిపారు.

➡️