విద్యుత్‌ భారాలను తక్షణమే రద్దు చేయాలి

Dec 11,2023 16:35
రైతులకు వ్యవసాయ

ప్రజాశక్తి – కాకినాడ

రాష్ట్ర ప్రజలపై ప్రభుత్వం విధిస్తున్న విద్యుత్‌ భారాలను తక్షణమే రద్దు చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ భారాలను తగ్గించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో సేకరించిన సుమారు 5 వేల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని సోమవారం జిల్లా కలెక్టరేట్‌ స్పందన లో జడ్‌పి సిఇఒ ఎ.రమణారెడ్డికి సిపిఎం నగర కన్వీనర్‌ పలివెల వీరబాబు, సీనియర్‌ నేత కె.సత్తిరాజు, నగర కమిటీ సభ్యుడు మలక వెంకట రమణలు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా విద్యుత్‌ శాఖ ఉద్యోగిని పిలిచి విద్యుత్‌ బిల్లులలో కలుపుతున్న వివిధ రకాల ఛార్జీల గురించి ఆయన అడిగారు. ఎలక్ట్రికల్‌ రెగ్యులేటరీ కమిషన్‌ సిఫార్సుల మేరకు ఛార్జీలు వేయడం జరుగుతుందన్నారు. ప్రజల విన్నపాన్ని ప్రభుత్వానికి తెలియచేయాలని సిపిఎం నాయకులు కోరారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు కె.సత్తిరాజు మాట్లాడుతూ ప్రయివేటు విద్యుత్‌ కంపెనీలకు, ఆదానీ వంటి బొగ్గు సప్లై దారులకు మరిన్ని లాభాలు కట్టబెట్టడానికే ప్రజలపై భారాలు వేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ బిల్లులలో కలుపుతున్న వివిధ రకాల ఛార్జీలను రద్దు చేయాలని, ప్రీ పెయిడ్‌ స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం నగర కన్వీనర్‌ పలివెల వీరబాబు మాట్లాడుతూ విద్యుత్‌ లేని మానవ జీవనాన్ని ఊహించలేమన్నారు. మానవ జీవనాన్ని భరోసా కల్పించవలసిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. ప్రజల అవసరాన్ని అవకాశంగా తీసుకుని విద్యుత్‌ ఛార్జీల భారాలు వేయడం సమంజసం కాదన్నారు. విద్యుత్‌ యూనిట్‌ ఒక్క రూపాయికే సరఫరా చేయాలని, సామాన్యులకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందించాలని, రైతులకు వ్యవసాయ రంగానికి పూర్తిగా ఉచిత విద్యుత్‌ అందించాలని సిపిఎం కోరుతుందన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించని పక్షంలో సిపిఎం నిర్వహించే ఉద్యమాలకు ప్రజలంతా అండగా నిలబడాలని ఆయన కోరారు.

➡️