విలేజ్‌ క్లీనిక్‌ సేవలు భేష్‌ : డిఎంహెచ్‌ఒ

Dec 17,2023 20:40

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి :  జిల్లాలో విలేజ్‌ క్లీనిక్‌ సేవలు భేష్‌గా అందుతున్నాయని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి ఎస్‌.భాస్కరరావు తెలిపారు. పిహెచ్‌సిల్లో శతశాతం వైద్యులు ఉన్నారని, మౌలిక సదుపాయాలు కూడా పూర్తిస్థాయిలో ఉన్నాయని స్పష్టం చేశారు. అవసరమైన చోట నూతన భవనాలు కూడా చేపడుతున్నట్టు తెలిపారు. జగనన్న సురక్ష వైద్య శిబిరాల ద్వారా జిల్లా వ్యాప్తంగా 2,53,679 మందికి ఆరరోగ్య తనిఖీలు చేపట్టినట్టు వివరించారు. వీరిలో గుండె, ఊరితిత్తులు, కంటి చూపు మందగించడం తదితర సమస్యలతో బాధపడుతున్న 8,541 మందిని వివిధ ఆసుపత్రులకు రిఫర్‌ చేసినట్టు చెప్పారు. 2024 జనవరి నుంచి రెండో విడత జగనన్న సురక్ష వైద్య శిబిరాలను నిర్వహించనున్నట్టు ఆయన చెప్పారు. ఈ వారం తనను కలిసిన ప్రజాశక్తికి ముఖాముఖి ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే…..

విలేజ్‌ హెల్త్‌ క్లీనిక్‌ వ్యవస్థ ఎలా నడుస్తోంది?

జిల్లా వ్యాప్తంగా 482 విలేజ్‌ హెల్త్‌ క్లీనిక్‌లు ఉన్నాయి. వీటన్నింటిలోనూ బిఎస్‌సి నర్సింగ్‌ అర్హతగల కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లుగా ప్రభుత్వం నియమించింది. వీరంతా స్థానిక గ్రామ సచివాలయ పరిధిలోని ఎఎన్‌ఎం గ్రామాల్లోని ఆశా వర్కర్లతో సమన్వయం చేసుకుని రోజూ ఒక పూట క్లీనిక్‌లోనూ, మరో పూట ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వెద్య సేవలు అందిస్తున్నారు. ప్రాథమిక వైద్యంతోపాటు భవిష్యత్తులో గ్రామ స్థాయిలోనే ప్రసవ సేవలు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.

విలేజ్‌ క్లీనిక్‌లలో ఎలాంటి సేవలు అందుబాటులో ఉంటాయి?

బిపి, సుగర్‌తోపాటు డెంటల్‌, కేన్సర్‌ తదితరాల స్క్రీనింగ్‌, గర్భిణులు, బాలింతలకు అవసరమైన వైద్యంతోపాటు దాదాపు 12రకాల వైద్య సేవలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. మలేరియా, డెంగీ, హెచ్‌ఐవి, సుగర్‌ తదితర 14రకాల వైద్య పరీక్షలు కూడా ఇదే క్లీనిక్‌లో నిర్వహిస్తున్నారు. వీటన్నింటికీ సంబంధించిన మందులు, వైద్యపరికరాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

పిహెచ్‌సిల్లో వైద్యపోస్టులు, భవనాలు సంగతి ఎలా ఉంది?

జిల్లా వ్యాప్తంగా 48 పిహెచ్‌సిలు ఉండగా, వీటిలో 6 పిహెచ్‌సిలకు నూతన భవనాలు మంజూరయ్యాయి. వీటిలో జామి, ఎల్‌.కోట, కొత్తవలస, చల్లపేట, అలమండ, వియ్యంపేట పిహెచ్‌సిలు ఉన్నాయి. రెండు పిహెచ్‌సిల భవనాలు ఇప్పటికే పూర్తయ్యాయి. వియ్యంపేట మినహా మిగిలిన అన్ని పిహెచ్‌సిల్లోనూ ఇద్దరు చొప్పున వైద్యులు ఉన్నారు. వియ్యంపేటలో ఒక వైద్యపోస్టు నియామకం న్యాయ స్థానం పరిధిలో ఉండడం వల్ల ఇంకా భర్తీ కాలేదు.

పిహెచ్‌సిలు, విలేజ్‌ క్లినిక్‌లలో మీ పర్యవేక్షణ ఎలా ఉంది?

గడిచిన 6నెలల్లో సుమారు 80వరకు పిహెచ్‌సిలను సందర్శించి వైద్యులను అప్రమత్తం చేయడం, తగిన సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. ఇదే క్రమంలో చిన్నచితకా సమస్యలు ఉంటే వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నాను. విలేజ్‌ క్లినిక్‌లలో కూడా కమ్యూనిటీ హెల్‌ ఆఫీసర్లు ఉండేందుకు రెండు అదనపు గదులు ఉన్నాయి. రోగులను తనిఖీ చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయి. రోగులు కూడా ఎంతో విశ్వాసంతో క్లినిక్‌లకు వస్తున్నారు. ముఖ్యాంగా ఇంటింటి సేవలు ప్రజలకు అందుతున్నాయి.

జగనన్న సురక్షలో ఎంతమందికి వైద్య పరీక్షలు నిర్వహించారు?

జిల్లాలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాల్లో 2,53,679 మందికి స్క్రీనింగ్‌ టెస్టులు నిర్వహించాం. వీరందరికీ కలిపి 2,90,000 వైద్యారోగ్య పరీక్షలు చేపట్టి అవసరమైన ముందులు పంపిణీ చేశాం. కొంతమందిని మెరుగైన వైద్యసేవలు, సర్జరీల కోసం ఇతర ఆసుపత్రులకు రిఫర్‌ చేశాం.

ఆసుపత్రులకు రిఫర్‌ చేసిన కేసులు ఎన్ని?

మొత్తంగా 8,541 మందిని వివిధ ఆసుపత్రులకు రిఫర్‌ చేశాం. వీరిలో 3,954 మంది కేటరాక్ట్‌, మిగిలినవారు ఇతర వ్యాధులతో బాధపడుతున్నారు. రిఫర్‌ చేసిన కేసుల్లో ఇప్పటి వరకు 1185 కేసులు ఆసుపత్రులకు వెళ్లాయి. 173మంది ఆసుపత్రుల్లో జాయిన్‌ అయ్యారు. వీరిలో 157మందికి సర్జరీలు చేయించుకున్నట్టు సమాచారం. 151 మంది ఇప్పటికే ఇళ్లకు చేరారు.

వైద్యశిబిరాల్లో ఎలాంటి కేసులు ఎక్కువగా బయటపడ్డాయి?

సురక్ష శిబిరాలకు వచ్చినవారిలో ఎక్కువ మందికి బిపి, సుగర్‌, కంటి చూపు సమస్యలతో ఉన్నట్టుగా వైద్యులు గుర్తించారు. వీరితోపాటు కంటిచూపు మందగించడం, గుండె, ఊపరితిత్తులు వంటి సమస్యలు కూడా బయటపడ్డాయి. వీరిలో అవసరమైనవారిని ఆసుపత్రులకు రిఫర్‌ చేసి, ఉచితంగా వైద్యం చేయడమే కాకుండా, రానుపోను ఛార్జీలు, ఇతర ఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తోంది.

మిగిలిన గ్రామాల్లో వైద్యశిబిరాలు కొనసాగుతాయా?

2024 జనవరి నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష ఆరోగ్య శిబిరాలు ప్రారంభం కానున్నాయి. ఈసారి గ్రామ స్థాయిలో కాకుండా మండల కేంద్రాలు, పక్కపక్క గ్రామాలకు అందుబాటులో ఉండే ఊళ్లల్లో పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. మండలం యూనిట్‌గా నెలలో నాలుగు శిబిరాలు చొప్పున ఆరు నెలల పాటు నిర్వహించేందుకు ప్రణాళి రూపకల్పన జరుగుతోంది. ఇవి కూడా మంగళ, శుక్రవారాల్లో నిర్వహించాలని ప్రభుత్వం సూచన ప్రాయంగా ఇప్పటికే చెప్పింది.

➡️