వృద్ధులు, వికలాంగులతో వైసిపి చెలగాటం

Apr 2,2024 20:51

ప్రజాశక్తి- బొబ్బిలి : రాజకీయ లబ్ది కోసం సామాజిక పింఛన్‌ దారులతో వైసిపి ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని టిడిపి, జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బేబినాయన అన్నారు. కోటలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం పేదల జీవితాలు, సామాజిక పింఛన్‌ దారులతో చెలగాటం ఆడుతుందని విమర్శించారు. రాజకీయ లబ్ది కోసం పింఛన్ల పంపిణీ టిడిపి అడ్డుకుందని వైసిపి నేతలు గ్లోబల్‌ ప్రచారం చేస్తున్నారన్నారు. చంద్రబాబు వల్లనే పింఛన్లు పంపిణీ ఆగిపోయిందని తప్పుడు ప్రచారం చేయడం అన్యాయమన్నారు. వాలంటీర్‌ వ్యవస్థకు టిడిపి వ్యతిరేకం కాదన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే వాలంటీర్‌ వ్యవస్థను మరింత బలోపేతం చేయనున్నట్లు చెప్పారు. రాజకీయాలకు వాలంటీర్లను వాడుకోవడానికి టిడిపి వ్యతిరేకమని చెప్పారు. రాష్ట్రంలో పింఛన్‌ దారులకు చెల్లించాల్సిన రూ.13వేల కోట్లు వైసిపి కాంట్రాక్టర్లకు చెల్లించారని విమర్శించారు. ఎన్నికల కోడ్‌ వుంటుండగా కాంట్రాక్టర్లకు పింఛన్ల సొమ్ము ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో లక్షా 35వేల మంది సచివాలయ ఉద్యోగులు, పంచాయతీ కార్యదర్శులు, ఇతర ఉద్యోగులు ఉన్నారన్నారని, వీరితో ఎందుకు పింఛన్లు పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు. పేద ప్రజలను ఇబ్బందులు పెట్టి రాజకీయ లబ్ది పొందాలని చూడడం సిగ్గు చేటన్నారు. ఈ నెల 5 లోగా పింఛన్లు ఇంటింటికి పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. టిడిపి అధికారంలోకి వస్తే పింఛన్‌ రూ.4వేలు ఇంటింటికి పింఛన్‌ ఇస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో వైసిపికి ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమన్నారు.పింఛన్లు అందించాలని వినతివేపాడ: మండలంలో సామాజిక పింఛన్లను సచివాలయం సిబ్బందితో పంపిణీ చేయించాలని ఎంపిడిఒ అనిచ్చతకు మంగళవారం నాయకులు గొంప వెంకటరావు, గుమ్మడి భారతి, సేనాపతి గణేష్‌, పి.రమణ వినతి పత్రాన్నిచ్చారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు సామాజిక పింఛన్లను సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దకే పంపిణీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జి రాము, ఎం ముత్యాల నాయుడు, తదితరులు పాల్గొన్నారు.ఇంటి వద్దే పింఛన్‌ ఇచ్చే ఏర్పాటు చేయాలిపూసపాటిరేగ: వృద్ధులకు, వికలాంగులకు ఇళ్ల వద్దనే పింఛన్‌లు ఇచ్చే ఏర్పాటు చేయాలని టిడిపి మండల అధ్యక్షులు మహంతి శంకరావు, పిన్నింటి సన్యాసినాయుడు మంగళవారం ఎంపిడిఒ రాధికకు వినతి అందించారు. ఎన్నికలు కోడ్‌ నేపధ్యంలో నేరుగా నగదు పంపిణీ చేసే వాలంటీర్ల వ్యవస్ధను తప్పిస్తూ ఎన్నికల కమీషనర్‌ ఆదేశాలు చేశారన్నారు. ఈ నేపథ్యంలో పించన్‌ పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని కోరారు. సచివాలయ సిబ్బంది, కార్యదర్శిలు ద్వారా పంపిణీ ఏర్పాట్లు చేయాలని కోరారు. లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలన్నారు.బొబ్బిలి: వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఇచ్చే సామాజిక పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం ఆలస్యం వహిస్తే ఆందోళనా కార్యక్రమాలు చేపడుతామని సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ అన్నారు. మంగళవారం బొబ్బిలి సిపిఐ కార్యాలయంలో విలేకర్లతో ఆయన మాట్లాడారు. ఎన్నికల నింబంధనల మేరకు ఎన్నికల సంఘం వాలంటీర్లను పక్కన పెడితే దానికి చంద్రబాబు, నిమ్మగడ్డ ప్రసాద్‌, ప్రతిపక్షాలు కారణం అంటూ జగన్మోహన్‌ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చెప్పడం సిగ్గుచేటన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి పింఛన్లు అందించాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కోట అప్పన్న, మండల కార్యదర్శి తాడంగి ఎండుదొర తదితరులు పాల్గొన్నారు.బాడంగి: ఇంటింటికీ పింఛను పంపిణీ చేయాలని టిడిపి మండల అధ్యక్షులు తెంటు రవిబాబు, టిడిపి జిల్లా బీసీ సాధికారిక కన్వీనర్‌ కొల్ల అప్పలనాయుడు ఒక ప్రకటనలో కోరారు. నాయకులు మాట్లాడుతూ కావాలనే పింఛన్‌ పంపిణీ లేట్‌ చేస్తున్నారని ఇదంతా జగన్‌ ఆడే జగన్‌ నాటకం అని అన్నారు.జామి: ఎన్నికల నియమావళిని దృష్టిలో ఉంచుకుని వాలంటీర్లను ప్రభుత్వ కార్యకలాపాలకు వాడొద్దని కమిషన్‌ ఆదేశాల మేరకు సచివాలయం సిబ్బందితో పింఛన్లు పంపిణీ ఇంటి వద్దే చేపట్టాలని టిడిపి నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం ఎంపిడిఒకు వినతి పత్రం అందజేశారు. పింఛన్లు పంపిణీ విషయంలో వైసిపి తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. ఖాజానాలో నిధులు లేకపోవడం, పింఛన్లు పంపిణీని టిడిపి అడ్డుకుందని చెప్పడం సిగ్గు చెటన్నారు. తక్షణమే పింఛన్లు పంపిణీకి చర్యలు చేపట్టాలని అన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్‌పిటిసి పెదబాబు, టిడిపి నాయకులు వర్రీ రమణ, శ్రీలక్ష్మి, కొత్తలి సూర్యారావు, స్వామినాయుడు, రాయవరపు శంకరావు, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.శృంగవరపుకోట: అవ్వ, తాతలకు ఇస్తామని చెబుతున్న రూ.13 వేల కోట్లు పెన్షన్‌ సొమ్ము ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా సొంత కాంట్రాక్టర్లకు ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి దోచి పెట్టారని దీంతో నిధులు కొరత ఏర్పడి పింఛన్లు పంపిణీ చేయలేదని, టిడిపి మండల అధ్యక్షుడు జిఎస్‌ నాయుడు అన్నారు. వైసిపి తమపై దుష్ప్రచారం చేస్తుందని దీనిని అరికట్టాలని కోరుతూ ఎంపిడిఒ సాంబశివరావుకు మంగళవారం వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి వెంకన్న, మల్లేశ్వరరావు, రామకృష్ణ, చిన్నికృష్ణ, వాసు, చెక్క కిరణ్‌, బి.శెట్టి అరుణ, ఇందుకురి శ్రీనివాసరాజు, భరత్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️