వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత

ప్రజాశక్తి-పీలేరు దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి వైద్యరంగానికి అధిక ప్రాదాన్యతనిస్తూ పేదలకు మెరుగైన వైద్యసేవలందిస్తున్నారని లోక్‌సభ ప్యానల్‌ స్పీకర్‌, రాజంపేట ఎంపీ మిధున్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం పీలేరు ప్రభుత్వ ఆస్పత్రిని 50 నుంచి 100 పడకలకు పెంచుతూ రూ.24 కోట్లతో నిర్మించిన నూతన భవనాలను మిధున్‌రెడ్డి, కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ప్రారం భించారు. ఈ సందర్భంగా మిథున్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మో హన్‌రెడ్డి వైద్య రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ వైద్య అభివద్ధికి కషి చేశారని తెలిపారు. గతంలో రేషన్‌కార్డు, పెన్షన్లు కావాలంటే ప్రజలు కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగేవారని నేడు సచివాలయ, వాలంటీర్ల, వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలు పేదల ముంగిటకు చేరుతున్నాయని పేర్కొన్నారు. గతంలో పీలేరు పట్టణంలో ప్రజలు నీటి సమస్యతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే వారిని ప్రస్తుతం నీటి సమస్య పూర్తిగా నివారించామని చెప్పారు. వాటర్‌ గ్రిడ్‌ పథకం ద్వారా ప్రతి ఇంటికి పైప్‌లైన్‌ కనెక్షన్‌ ఇస్తామని తెలిపారు. కనీవినీఎరుగని రీతిలో సంక్షేమ అభివద్ధి కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందని ఈ పథకాలు ఇలాగే కొనసాగాలంటే ప్రతి ఒక్కరు ప్రభుత్వానికి సహకరించాలన్నారు. కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం పేదల సంక్షేమానికి విశేష కషి చేస్తూ అనేక సంక్షేమ, పథకాలు అమలు చేస్తోందన్నారు. పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకల నుంచి వంద పడకలకు పెంచడం ఎంతో గొప్ప విషయమన్నారు. రాబోయే రోజుల్లో ఈ ఆసుపత్రికి సంబంధించి రోడ్ల సమస్య, సిబ్బంది సమస్యలు లేకుండా వెంటనే పరిష్కరించడం జరుగుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో పేదలందరికీ ఇంటి పట్టాలు పంపిణీ చేసే బహత్తర కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఇంటి పట్టాలు పొందిన వారందరికీ సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్లు చేయించి పేదలకు ఒక భరోసా కల్పించామన్నారు. ప్రభుత్వం అందజేసిన ఇంటి స్థలంలో ప్రతి ఒక్కరూ ఇల్లు నిర్మించుకొని సంతోషంగా జీవించాలన్నారు. ఎవరు కూడా ఇంటి పట్టాను అమ్ముకోకుండా ఒక ఆస్తిలా స్థిరస్థాయిగా నిలుపుకోవాలన్నారు. ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పీలేరు పట్టణంలో 50 పడకల ప్రభుత్వాసుపత్రిని వంద పడకు మార్చుకోవడం ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. వైద్యులు రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిచ్చారని పేర్కొన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా పథకాలను ఇంటి ముంగిటకు చేర్చారన్నారు. కార్యక్రమంలో ఎపి మైనార్టీ కమిషన్‌ చైర్మన్‌ ఇక్బాల్‌ అహ్మద్‌, ఆర్‌డిఒ రంగస్వామి, పీలేరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌ డాక్టర్లు, వైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

➡️