వైభవంగా రథ సప్తమి వేడుకలు

ప్రజాశక్తి-మార్కాపురం: తిరుమల తిరుపతి తరహాలో రథసప్తమి వేడుకలు మార్కాపురంలో మాత్రమే జరుగుతాయి. శుక్రవారం నాటి రథ సప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. వేడుకలను ఆలయ కమిటీ అధ్యక్షులు పెనుగొండ కేశవరావు, రథ సప్తమి సేవా సమితి అధ్యక్షులు యక్కలి కాశీవిశ్వనాథం, ఆలయ ఇఓ గొలమారి శ్రీనివాసరెడ్డి, ధర్మకర్తల సారథ్యంలో ఈ వేడుకలు కన్నుల పండువలా నిర్వహించారు. సప్త వాహనాలపై ఉత్సవాలు పగలంతా నిర్వహించారు. సాయంత్రం వేళ వెండి రథోత్సవం నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవస్వామి రథోత్సవంపై ఊరేగింపు జరిపారు. వెండి రథోత్సవానికి ఇసుకేస్తే రాలనంతగా జనం వచ్చారు. వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. వేడుకలకు విచ్చేసిన వారందరికీ ఉదయం, సాయంత్రం అల్పాహారం, మధ్యాహ్నం అన్నదానం భారీగా చేపట్టారు. రథోత్సవం సందర్భంగా నాలుగు మాడ వీధుల్లో వ్యాపార సంస్థలు మూసివేశారు. వేడుకల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆర్‌టిసి బస్సులను దారి మళ్లించి వై జంక్షన్‌ మీదుగా బస్టాండుకు నడిపారు. ప్రధాన రాజకీయ పార్టీల నేతలు వేడుకల్లో పాల్గొన్నారు.

➡️