వైసిపిది నినాదం కాదు.. విధానం..

Feb 2,2024 00:07

విలేకర్లతో మాట్లాడుతున్న మంత్రి అంబటి రాంబాబు
ప్రజాశక్తి – సత్తెనపల్లి టౌన్‌ :
బడుగుల సాధికారిత నినాదం కాదని అది తమ పార్టీ విధానమని, ఇందుకు రుజువే నర్సరావుపేట పార్లమెంటు స్థానానికి బీసీ సామాజిక తరగతికి చెందిన అనీల్‌ కుమార్‌ యాదవ్‌ నియామకమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. స్థానిక వైసిపి కార్యాలయంలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఘన చరిత్ర కలిగిన నర్సరావుపేట నుండి మహానుభావులు ఎందరో పార్లమెంటుకు పోటీ చేశారని, అలాంటి స్థానానికి అనీల్‌కుమార్‌ యాదవ్‌కు కేటాయించిన సిఎం జగన్‌మోహన్‌రెడ్డి చారిత్రాత్మకమైన నిర్ణయానికి శ్రీకారం చుట్టారని అన్నారు. బడుగ వర్గాలు వెనుకపడ్డ కులాలు కాదని, వారే వైసిపికి వెన్నెముకని అన్నారు. అనీల్‌కుమార్‌ యాదవ్‌ను ఎంపీగా గెలిపించుకోవాల్సిన బాధ్యత బీసీలపై ఉందన్నారు. లావు శ్రీకష్ణదేవరాయులు పార్టీని వీడడం దుర్మార్గమన్నారు. బీసీల పట్ల టిడిపి అవకాశ వాదంతో వ్యవహరిస్తోందని గుంటూరు మిర్చియార్డు చైర్మన్‌ ఎన్‌.రాజనారాయణ విమర్శించారు.40 వేల మెజార్టీతో గెలుస్తాం : బ్రహ్మనాయుడుప్రజాశక్తి – వినుకొండ : నరసరావుపేట పార్లమెంట్‌ స్థానం నుండి వైసిపి అభ్యర్థిగా అనిల్‌ కుమార్‌ యాదవ్‌ను పార్టీ అధిష్టానం ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. స్థానిక వైసిపి కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఇప్పటి వరకు ఆ స్థానాన్ని బీసీలకు ఎప్పుడూ కేటాయించలేదని, తాజా నిర్ణయంతో నరసరావుపేట పార్లమెంట్‌ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ వైసిపి గెలవబోతోందని, తాను 40 వేల మెజార్టీతో గెలుస్తానని అన్నారు. సిద్ధం పేరుతో సిఎం నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారని అన్నారు. రూ.2.50 లక్షల కోట్ల బడ్జెట్‌తో అనేక సంక్షేమ పథకాలను వైసిపి ప్రవేశపెట్టగా గత టిడిపి ప్రభుత్వ హయాంలో నీరు-చెట్టు, జన్మభూమి కమిటీల పేరుతో రూ.లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. పదేళ్లు ఎమ్మెల్యేగా కొనసాగిన జీవీ ఆంజనేయులు నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేదన్నారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్మన్‌ దస్తగిరి షకీలా, నాయకులు వెంకటరావు పాల్గొన్నారు.మందలించిన మాట నిజమే : మహేష్‌రెడ్డిప్రజాశక్తి-పిడుగురాళ్ల : సామాన్య కార్యకర్తను పార్లమెంటు సభ్యులుగా నిలబెట్టి గెలిపించే సత్తా ముఖ్యమంత్రి జగన్‌కు ఉందని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని ఆర్‌ అండ్‌ బి బంగ్లాలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. నరసరావుపేట పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఇప్పటి వరకు వ్యాపార వేత్తలు పోటీ చేశారని, కానీ ఒక సామాన్య కార్యకర్త, బీసీ నాయకుడు అనిల్‌ కుమార్‌ యాదవ్‌ను గెలిపించాలని జగన్‌ భావించారని చెప్పారు. నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను, ఎంపీ అభ్యర్థిని గెలిపించుకుంటామని చెప్పారు. తన గురించి సామాజిక మాధ్యమాల్లో ఒక ఆడియో వస్తోందని, తాను ఒకర్ని మందలించిన మాట నిజమేనని అన్నారు. తమ పార్టీలో ఉంటూ పదవులు అనుభవిస్తూ ద్వంద వైఖరి వ్యవహరించినందుకు మందలించానని చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ కె.మంగమ్మ వెంకటేశ్వర్లు, మాజీ చైర్మన్‌ ఎమ్‌డి గఫార్‌, వైసిపి అధ్యక్షులు సిహెచ్‌.వెంకట రామారావు, యూత్‌ అధ్యక్షులు ఎం.సుధీర్‌, నాయకులు జి.పవన్‌రెడ్డి పాల్గొన్నారు.

➡️