వైసిపిలో తొలగని గందరగోళం

Feb 11,2024 00:29

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో వైసిపి సమన్వయకర్తల నియామకం పార్టీలో తీవ్ర గందరగోళానికి దారితీసింది. మొదటి విడత జాబితాలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్థానంలో నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించిన గంజి చిరంజీవి పరిస్థితి ప్రస్తుతం డోలాయనంలో పడింది. చిరంజీవి అభ్యర్థిత్వంపై సర్వే చేసిన ఐ ప్యాక్‌ బృందాలు ప్రతికూల పవనాలే ఎక్కువగా ఉన్నాయని నివేదికలిచ్చాయి. చిరంజీవి స్థానంలో మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూమార్తె, ఎమ్మెల్సీ మరుగుడు హనుమంతరావు కోడలు లావణ్య పేరును అధిష్టానం పరిశీలిస్తోంది. ప్రత్తిపాడులోనూ అసమ్మతి ప్రారంభమైంది. ప్రస్తుత సమన్వయకర్త బలసాని కిరణ్‌కుమార్‌కు కాకుండా మాల సామాజిక తరగతికి ఈ కేటాయించాలని శనివారం గుంటూరులో సమావేశమైన మాలల సమావేశం డిమాండ్‌ చేసింది. బలసాని కిరణ్‌కుమార్‌ స్థానికేతరుడుగా ప్రచారమవుతుండడంతో ఆయన్ను మార్చాలా? కొనసాగించాలా? అనే అంశంపై వైసిపి అధిష్టానం తర్జనభర్జన పడుతోంది. రేపల్లెలో సమన్వయకర్త ఈపూరి గణేష్‌ అభ్యర్థిత్వంపైనా సానుకూలత రావడంలేదని సర్వేల్లో వెల్లడయినట్టు తెలిసింది. దీంతో ఇటీవల రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణతో సిఎం జగన్‌ ఈ అంశంపై చర్చించినట్టు తెలిసింది. మోపిదేవి సహకరించడం లేదన్న అనుమానంతో ఆయన చెప్పిన వారికే అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో సిఎం జగన్‌ ఉన్నారని ప్రచారమవుతోంది. గణేష్‌ను కొనసాగించండి… తన సహకారం ఉంటుందని అని మోపిదేవి నర్మగర్భంగా చెప్పినట్టు తెలిసింది. పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు టిక్కెట్‌ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఆయన్ను మార్చే అవకాశం ఉందని సీనియర్‌ నాయకుడొకరు అభిప్రాయపడ్డారు. కొద్ది రోజులు ఆగాలని అధిష్టానం చెప్పడంతో రోశయ్య కూడా నియోజకవర్గానికి వెళ్లడం తగ్గించారు. గుంటూరు లోక్‌సభకు రోశయ్య బావమరిది ఉమ్మారెడ్డి వెంకట రమణకు ఖరారు చేయడంతో రోశయ్య అభ్యర్థిత్వం పెండింగ్‌లో పడింది. ఒకే కుటుంబంలో ఇద్దరికి ఇవ్వడం కంటే పొన్నూరులో మరొకరికి ఇవ్వాలని యోచిస్తున్నారు. ఎవరిని పొన్నూరు వెళ్లమన్నా మాకొద్దు బాబోరు అంటున్నారని పార్టీలో ప్రచారం ఉంది. రెండేళ్లుగా వైసిపికి జిల్లా ఇన్‌ఛార్జిగా ఉన్న ఆళ్ల అయోధ్య రామిరెడ్డిని కూడా ఇటీవల తప్పించారు. ఎంపి విజయసాయిరెడ్డికి గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం బాధ్యతలు అప్పగించారు. అయోధ్యరామిరెడ్డి సోదరుడు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పదవికి, వైసిపికి రాజీనామా చేసిన కొద్ది రోజులకే కాంగ్రెస్‌లో చేరారు. దీంతో అయోధ్యరామిరెడ్డి పరిస్థితి ఇరకాటంలో పడింది. అంతేకాకుండా వీరిద్దరి సమీప బంధువు మోదుగుల వేణుగోపాలరెడ్డికి ఉమ్మడి జిల్లాలో ఎక్కడా పోటీ చేసే అవకాశం కల్పించలేదు. 2019 ఎన్నికల్లో వైసిపి తరుఫున గుంటూరు లోక్‌సభ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి పల్నాడు జిల్లాలో ఏదో ఒక అసెంబ్లీ నుంచి అవకాశం కల్పిస్తామని పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినా సామాజిక సమీకరణల్లో ఆయనకు అవకాశం దక్కలేదు. పల్నాడు జిల్లాలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అసమ్మతి బావుటా ఎగుర వేశారు. తనకు పార్టీలో తగిన గౌరవం, గుర్తింపు లేదని, సిఎం జగన్‌ ఏడాదిన్నర అపాయిమెంట్‌ ఇవ్వడంలేదని అసమ్మతి రాజకీయాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డిపై విమర్శల వాగ్భాణాలను సంధిస్తున్నారు. సత్తెనపల్లిలో కూడా మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా అసమ్మతి రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. అంబటికి టిక్కెట్‌ కొనసాగింపుపై పార్టీలో ఇంకా సందిగ్ధం లేకపోలేదు. చిలకలూరిపేటలో మంత్రి విడదల రజిని స్థానంలో సమన్వయకర్తగా నియమితులైన మల్లెల రాజేష్‌ నాయుడు అభ్యర్థిత్వంపై కూడా ఐప్యాక్‌ సర్వే చేస్తున్నట్టు తెలిసింది. వినుకొండలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు వైసిపికి గుడ్‌బై చెప్పారు. టిడిపిలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటు న్నారు. నరసరావుపేట ఎంపి లావు శ్రీకృష్ణదేవరా యులు వైసిపిని వీడి టిడిపిలో చేరేందుకు సిద్ధమయ్యారు. శ్రీకృష్ణదేవరాయలు స్థానంలో నెల్లూరు ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ను నరసరావుపేట లోక్‌సభకు సమన్వయకర్తగా నియమించారు. దీనిద్వారా బిసి కార్డుతో ఏడు నియోజకవర్గాల్లో లబ్ధి పొందాలని వైసిపి వ్యూహరచన చేస్తోంది.
(ఎ.వి.డి.శర్మ)

➡️