వైసిపి నేతలు మెక్కిందంతా కక్కిస్తాం…

Jan 11,2024 00:02
ఐదేళ్ల పాటు

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి, కోటనందూరు

ఐదేళ్ల పాటు వైసిపి నాయకులు రాష్ట్రాన్ని దోచుకున్నారని, తాము అధికారంలోకి రాగానే వైసిపి నేతలు మెక్కిందంతా కక్కిస్తామని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తునిలోని చామవరంలో బుధవారం నిర్వహించిన ‘రా.. కదిలిరా’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌ నేడు రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేశారన్నారు. ప్రజలపై పెనుభారాలు మోపారన్నారు. జగన్‌ అహంకారమే అతని అంతానికి దారి తీసే పరిస్థితి నేడు నెలకొందన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ఓడించి రాష్ట్రాన్ని గెలిపించాలన్నారు. భారీగా పెరిగిన నిత్యవసరాలు5 ఏళ్లలో రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. టిడిపి హయాంలో రూ.70 ఉన్న పెట్రోలు నేడు రూ.110కి, రూ.70 ఉన్న డీజిల రూ.98 పెరిగాయన్నారు. బియ్యం, పప్పుల ధరలు రెట్టింపు అయ్యాయన్నారు. వంటనూనె రూ.60 నుంచి రూ.130కి ఎగబాకిందన్నారు. ఎల్‌పిజి గ్యాస్‌ సామాన్యులు కొనుగోలు చేయని పరిస్థితికి వచ్చిందన్నారు. పెరిగిన ధరలతో మళ్లీ కట్టెల పొయ్యిపై ఆడబిడ్డలు వంట చేసుకుంటున్నారన్నారు. టిడిపి అధికారంలోకొస్తే ఏడాదికి 3 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. పండుగ వేళ ప్రజలు పస్తులుండే పరిస్థితిని తీసుకొచ్చారన్నారు.టిడిపితోనే ప్రజల జీవితాల్లో వెలుగులుసంక్షేమం, అభివృద్ధితో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపింది టిడిపియేనని బాబు అన్నారు. పేదల్ని ఆదుకునే బాధ్యత తనదేనన్నారు. అన్న క్యాంటీన్లు మళ్లీ ఏర్పాటు చేసి పేదల ఆకలి తీర్చుతానని తెలిపారు. టిటిడిలోనూ భక్తులకు నాసిరకం భోజనం పెట్టడం దుర్మార్గమన్నారు. త్వరలోనే పేదల ప్రభుత్వం, రైతు రాజ్యం వస్తుందన్నారు. వచ్చే సంక్రాంతికి ప్రజల ముఖాల్లో వెలుగులు నింపుతామన్నారు. మ్యానిఫెస్టోలో అంశాలను ఆయన వివరించారు. నిరాశలో నిరుద్యోగులు జగన్‌ నిరుద్యోగులను తీవ్రంగా నిరాశపరిచారని బాబు అన్నారు. జాబ్‌ క్యాలెండర్‌, మెగా డిఎస్‌సిలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తమ పాలనలో లక్షలాది టీచర్‌ పోస్టులను భర్తీ చేశామని గుర్తు చేశారు. జగన్‌ ఒక్క టీచర్‌ పోస్టునూ భర్తీ చేయలేదన్నారు. జాబు కావాలంటే బాబు రావాలన్నారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు. అన్నదాత పథకం ద్వారా రైతులకు ఏడాదికి రూ.20వేలు ఇస్తామన్నారు. ఆక్వా రైతుల్ని ఆదుకుంటామని తెలిపారు. జగన్‌ అప్పుల కోసం ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టారన్నారు. మళ్లీ గెలిస్తే ప్రజల్ని కూడా తాకట్టు పెడతాడని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే సంపద సృష్టించి ఆదాయం పెంచుతామని హామీ ఇచ్చారు.రాజధాని లేకుండా చేశారుమూడు రాజధానుల పేరుతో జగన్‌ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ హయాంలో రాజధానిగా అమరావతే ఉంటుందని స్పష్టం చేశారు. పరిశ్రమల పొల్యూషన్‌ కంట్రోల్‌ చేసి మత్స్యకారులను రక్షిస్తామన్నారు. మత్స్యకారులను తామే ఆదుకున్నామన్నారు. జగన్‌ జిఒ 217 తీసుకొచ్చి మత్య్సకారుల పొట్టకొట్టారన్నారు. మద్య నిషేదం, పోలవరం, సీపీఎస్‌ రద్దు, ప్రత్యేక హోదా హామీలు ఏమయ్యాయన్నారు. మంత్రి రాజా అక్రమాలపై ధ్వజం స్థానిక మంత్రి దాడిశెట్టి రాజా అక్రమాల రాజాగా మారారన్నారు. చెక్‌ పోస్టుల్లో వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు. ఆయన మామూళ్లకు వ్యాపారులు పరారవుతున్నారని విమర్శించారు. 200పైగా ఎకరాలు కబ్జా చేశారన్నారు. కాకినాడ ఎంఎల్‌ఎ ద్వారంపూడి గంజాయి రవాణాకు ద్వారం తెరిచాడని తెలిపారు. బియ్యం మాఫియాను నడుపుతున్నది ద్వారంపూడి అని ఆరోపించారు. ఎంఎలఎ కన్నబాబు చేసిన అవినీతి అంతా ఇంతా కాదన్నారు. ఎంఎల్‌ఎలను మార్చడం కాదు ప్రజలనే జగన్‌ను మార్చేందుకు సిద్ధమయ్యారన్నారు. ఎస్‌సి, బిసి ఎంఎల్‌ఎలను మారుస్తున్న జగన్‌ పెద్దిరెడ్డి, ద్వారంపూడిలను ఎందుకు మార్చలేదని ప్రశ్నించారు. ఈ జిల్లాలో మిధున్‌ రెడ్డి, ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిల పెత్తనం ఏంటన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక తాండవ రిజర్వాయర్‌ ఆధునికీకరిస్తామని, పోలవరం పూర్తి చేసి భవిష్యత్తులో 3 పంటలకు నీళ్లిస్తామన్నారు. వేముల వాడ, పెద్దాపురం ఎత్తిపోతల పథకాలకు మరమ్మతులు చేయిస్తామన్నారు. పుష్కర ఎత్తిపోతల పథకం, టూరిజాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. కాకినాడకు పూర్వవైభవం తెచ్చే బాధ్యత టీడీపీ జనసేనదేనని హామీ ఇచ్చారు. ఈ సభలో టిడిపి మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, మాజీ మంత్రులు యనమల రామకీష్ణుడు, చిన్న రాజప్ప, బండారు సత్యానందరావు, చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎంఎల్‌ఎలు వనమాడి కొండబాబు, ఎస్‌విఎస్‌ఎన్‌.వర్మ, దాట్ల బుచ్చిబాబు, అయితాబత్తుల ఆనందరావు, టిడిపి నియోజకవర్గాలు ఇన్‌ఛార్జులు వరుపుల సత్యప్రభ, యనమల దివ్య, మహాసేన రాజేష్‌ జనసేన నాయకులు పంతం నానాజీ, తుమ్మల రామస్వామి, ఉదరు శ్రీనివాస్‌, టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు

➡️