సంక్రాంతికి సొంతూళ్లకు

ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రజలు సమాయత్తమయ్యారు. ఒక వైపు వెళ్లే వారు, మరొక వైపు ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చే వారితో జిల్లాలోని రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు అన్ని కిటకిటలాడుతున్నాయి. ఇదే సమయంలో ప్రజలకు ప్రయాణ కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రజల అవసరాల మేరకు బస్సులు, రైళ్లు అందుబాటులో ఉండటంలేదు. ఒకేసారి ఎక్కువమంది రిజర్వేషన్ల కోసం ప్రయత్నిస్తుండటంతో రైళ్లుకూడా ఖాళీగా ఉండటం లేదు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా రైళ్లు, బస్సులో ఎక్కువగా రద్దీ కన్పించింది. విద్యాసంస్థలకు ఈనెల 16 నుంచి సెలవులు ఇచ్చిన తల్లిదండ్రులకు శనివారం నుంచి సెలవులు కావడంతో ఎక్కువ మంది శుక్రవారం బయలు దేరారు. గుంటూరు నుంచి విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, నెల్లూరు తదితర ప్రాంతాలకు తరలి వెళ్లారు. కొంతమంది తెలంగాణలోని ఖమ్మం, వరంగల్‌ తదితర జిల్లాలకు కూడా రిజర్వేషన్లు చేయించుకున్నారు. రిజర్వేషన్లు లేని వారు టిక్కెట్లకోసం రైల్వేస్టేషన్లలో పడిగాపులు పడటం, క్యూలైన్లలో ఎక్కువ సేపు నిలబడటం కన్పించింది. కరెంటు రిజర్వేషన్లకూడా చాలా మంది క్యూకట్టారు. తత్కాల్‌ టిక్కెట్ల కోసం కూడా పెద్ద సంఖ్యలో ప్రయాణికులు వచ్చారు. రాష్ట్రంలోని అన్ని మార్గాల వైపు ఈనెల 22వ వరకు రాను పోను బెర్తులన్నీ నిండిపోయాయి. ప్రధానంగా ఆయా పట్టణాల్లో సాప్టువేర్‌ రంగంలో స్థిరపడిన వారు సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా రైళ్లలో రిజర్వే షన్లు దొరక్క బస్సులను ఆశ్రయిస్తున్నారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి కూడా జిల్లాకు వేలాది మంది తరలి వస్తున్నారు. దీంతో ఖాజా టోల్‌గేటు వద్ద కూడా రెండ్రోజులుగా వాహనాల రద్దీ పెరిగింది. శుక్రవారం సాయంత్రం సికింద్రాబాద్‌ నుంచి వస్తున్న అన్ని రైళ్లు రద్దీగానే గుంటూరుకు వచ్చాయి. శబరి, పల్నాడు, నారాయాణాద్రి, చెన్నై, విశాఖ తదితర ఎక్‌ప్రెస్‌లలో ఎక్కువ మంది సాఫ్టువేర్‌ ఇంజినీర్లు, ఇతర ఉద్యోగులు కుటుంబాలతో గుంటూరుకు చేరుకున్నారు. గుంటూరు నుంచి తిరుపతి వైపు, నంధ్యాల, అనంతపురం, బెంగుళూరు, చెన్నై మార్గాలకు వెళ్లే రైళ్లన్నీ రద్దీగా వెళ్లాయి. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి కూడా ఉమ్మడి జిల్లాకు చెందిన వారు సంక్రాంతికి సొంతూళ్లకు రావడం అనవాయితీగా వస్తోంది. కుటుంబంలోని రక్తసంబంధీకులు, బంధువులు యావత్తు ఏడాదికి ఒకసారి ఒకచోట కలిసి పండగ జరుపుకోవడం సంప్రదాయంగా ఉంది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబ సభ్యులు తమ బంధువల రాకకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బంధువులతో పాటు పలు ప్రాంతాల్లో గ్రామస్తులతో, స్థానికులతో కలిసి సంబంరాలు జరుపునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధానంగా గురటూరు, తాడికొండ, తెనాలి, వేమూరు, పొన్నూరు, మాచర్ల, పెదకూరపాడు, సత్తెనపల్లి తదితర నియోజకవర్గాలకు చెందిన ఎన్‌ఆర్‌ఐలు, సాప్టువేర్‌ ఇంజినీర్లు ఎక్కువ మంది జిల్లాకు తరలి వస్తున్నారు.

➡️