సంక్రాంతి లోగా ధాన్యం సేకరణ పూర్తి : కలెక్టర్‌

Dec 16,2023 20:57

 ప్రజాశక్తి – గరుగుబిల్లి  :  జిల్లాలో ధాన్యం సేకరణ సంక్రాంతి నాటికి పూర్తి చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని, అనివార్య కారణాల వల్ల జాప్యం జరిగితే జనవరి 20 నాటికి పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ తెలిపారు. మండలంలోని గొట్టివలసలో ధాన్యం సేకరణ కేంద్రాన్ని శనివారం ఆయన తనిఖీ చేశారు. ధాన్యం సేకరణకు అన్ని పరికరాలు అందుబాటులో ఉన్నాయా లేదా అని గమనించారు. తేమ శాతం, రవాణా విధానం, రవాణా వాహనాలకు జిపిఎస్‌ ఏర్పాటు, ధాన్యం బస్తాల పరిస్థితి, ట్రక్‌ షీట్‌ జనరేషన్‌ పరిశీలించారు. ధాన్యం కొనుగోలు సజావుగా జరగాలని ఆయన ఆదేశించారు. బిజిలు సమర్పించక పోతే ఇతర జిల్లాల మిల్లర్లకు అవకాశంమిల్లర్లు బ్యాంకు గ్యారంటీలు (బిజిలు) సమర్పించకపోతే ఇతర జిల్లాల మిల్లర్లకు అవకాశం కల్పించాలని అధికారులను జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. ఇందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. బిజిల జాప్యం మూలంగా ధాన్యం సేకరణలో ఇబ్బందులు తలెత్తరాదని చెప్పారు. కార్యక్రమంలో పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ ఎం.దేవుళ్లనాయక్‌, వ్యవసాయ అధికారి తదితరులు పాల్గొన్నారు.కొమరాడ : మండలంలోని గంగురేగువలస ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి విష్ణు చరణ్‌ శనివారం తనిఖీ చేశారు. మిల్లుల వద్ద లారీలను వెంటనే అన్‌ లోడ్‌ చేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి అనుసంధానమైన వాహనాలు జిపిఎస్‌ విధిగా కలిగి ఉండాలని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రం, వ్యవసాయ సిబ్బంది రైతులకు ధాన్యం కొనుగోలు ప్రక్రియపై స్పష్టమైన అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రం వద్ద కస్టోడియన్‌ అధికారులు విధిగా ఉండాలని, రైతులకు ఎటువంటి ఇబ్బందులూ తలెత్తరాదని అన్నారు. కార్యక్రమంలో ధాన్యం కొనుగోలు కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు. సీతంపేట: మండలంలోని కుసిమిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఐటిడిఎ పిఒ కల్పనకుమారి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం ధరల పట్టికపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే ధాన్యం కొనుగోలుపై ప్రజలకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ సిబ్బందికి సూచించారు. ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని అన్నారు. కార్యక్రమంలో పిఎఒ హరిక్రిష్ణ, వ్యవసాయ శాఖ అధికారి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

➡️