సచివాలయాలకు విద్యుత్‌ కట్‌

Jan 31,2024 21:05

ప్రజాశక్తి- బొబ్బిలి : ప్రజల వద్దకు పాలన అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చినప్పటికీ వాటికి సంబంధించిన విద్యుత్‌ బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్‌ శాఖాధికారులు విద్యుత్‌ కట్‌ చేశారు. మున్సిపాలిటీలో 16 సచివాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అన్ని సచివాలయాలకు గతేడాది జూన్‌ నుంచి విద్యుత్‌ బిల్లులు చెల్లించకపోవడంతో పాకీవీధి, సాయినగర్‌ సచివాలయాలకు బుధవారం విద్యుత్‌ శాఖాధికారులు విద్యుత్‌ కట్‌ చేశారు. విద్యుత్‌ కట్‌ చేయడంతో ఆయా సచివాలయాల్లో కార్యకలా పాలు నిలిచిపోయాయి. ప్రతినెల 16 సచివాల యాలకు నెలకు రూ.12వేలు వరకు విద్యుత్‌ బిల్లు వస్తుంది. జూన్‌ నుంచి జనవరి వరకు రూ.96వేలు వరకు విద్యుత్‌ బిల్లు బకాయి ఉంది. విద్యుత్‌ కట్‌ చేయడంతో సచివాలయ ఉద్యో గులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మిగిలిన సచివాల యాలకు కూడా విద్యుత్‌ కట్‌ చేస్తారని తెలుస్తుంది.పంపుహౌస్‌, మున్సిపల్‌ కార్యాలయం బిల్లులూ బకాయిమున్సిపాలిటీలో ప్రజలకు తాగునీరు సరఫరా చేసే పంపు హౌస్‌, పట్టణ ప్రజలకు వెలుగు ఇచ్చే వీధి దీపాలు, మున్సిపల్‌ కార్యాలయం విద్యుత్‌ బిల్లులు కూడా గతేడాది జూన్‌ నుంచి చెల్లించలేదు. పంపు హౌస్‌కు నెలకు రూ.12లక్షలు, మున్సిపల్‌ కార్యాలయం, వీధి దీపాలు విద్యుత్‌ బిల్లు రూ.2.75లక్షలు వరకు బిల్లు వస్తుంది. పంపు హౌస్‌ విద్యుత్‌ బిల్లు బకాయి రూ.96లక్షలు వరకు, వీధి దీపాలు, మున్సిపల్‌ కార్యాలయం విద్యుత్‌ బిల్లు రూ.22లక్షలు వరకు బకాయి చెల్లించాల్సి ఉన్నా ప్రభుత్వం చెల్లించడం లేదు. అత్యవసర విభాగాలకు విద్యుత్‌ బిల్లులు చెల్లించకపోవడంతో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై పలు విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం స్పందించి విద్యుత్‌ బిల్లులు చెల్లించాలని ప్రజలు, అధికారులు కోరుతున్నారు.సిఎఫ్‌ఎంఎస్‌లో బిల్లులు పెండింగ్‌విద్యుత్‌ బిల్లులు సిఎఫ్‌ఎంఎస్‌లో పెండింగు ఉన్నట్లు మున్సిపల్‌ మేనేజర్‌ శివప్రసాద్‌ చెప్పారు. విద్యుత్‌ బిల్లులు పెండింగులో ఉన్నప్పటికీ ప్రజా అవసరాలు తీర్చే ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్‌ కట్‌ చేయకూడదన్నారు. రెండు సచివాలయాలకు విద్యుత్‌ కట్‌ చేశారని, విద్యుత్‌ పునరుద్దరణ చేయాలని విద్యుత్‌ శాఖాధికారులను కోరినట్లు చెప్పారు. ప్రభుత్వం బిల్లులు విడుదల చేసిన వెంటనే విద్యుత్‌ బిల్లులు జమ అవుతాయన్నారు.

➡️