సమగ్ర శిక్ష ఉద్యోగుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌

సమగ్ర శిక్ష ఉద్యోగుల పట్ల ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగుల సమ్మె గురువారానికి 16వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా సమ్మె శిబిరాన్ని శ్రీనివాసరావు సందర్శించి ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని, హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. విద్యాశాఖలో కీలకపాత్ర పోషిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. సిఎం జగన్‌ పాదయాత్ర సందర్భంగా కాంట్రాక్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తానని ఇచ్చిన వాగ్దానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను విద్యా శాఖలో విలీనం చేసి రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సమస్యలను పరిష్కరించకపోగా సమగ్ర శిక్ష అభియాన్‌ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ ఉద్యోగులను తొలగిస్తామని బెదిరింపులకు దిగడం సరికాదన్నారు. బెదిరింపులతో ఉద్యమాన్ని ఆపలేరని, సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఉద్యోగులు చేసే పోరాటానికి సిపిఎం అండగా ఉంటుందని తెలిపారు. పిఆర్‌టియు రాష్ట్ర కార్యదర్శి పి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉద్యోగు లకు పిఆర్‌సి అమలు చేయకుండా, నెలల తరబడి వేతనాలు విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తుందని విమర్శిం చారు. సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం ఉన్న పార్ట్‌ టైం విధా నాన్ని రద్దుచేసి ఫుల్‌ టైం కాంట్రాక్టు విధానాన్ని అమలు చేయాలని కోరారు. సమగ్ర శిక్ష జెఎసి నాయకులు మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని, ముఖ్యంగా తమను విద్యావ్యవస్థలో విలీనం చేసి, రెగ్యులర్‌ చేయాలని కోరారు. సమగ్ర శిక్ష జెఎసి నాయకులు వినోద్‌, ఝాన్సీ, భగవాన్‌, రాజు, రాధిక, కేశవరావు, సత్య, సందీప్‌, దిలీప్‌ పాల్గొన్నారు.

➡️