సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెబాట

గుంటూరు సమ్మె శిబిరంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు, వివిధ సంఘాల నాయకులు
ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల్ని క్రమబద్ధీకరించాలని, హెచ్‌ఆర్‌ పాలసీ అమలు, సమాన పనికి సమాన వేతనం తదితర డిమాండ్లతో గుంటూరు జిల్లాలో మంగళవారం నుండి సమ్మెబాట పట్టారు. సమగ్రశిక్ష కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట సమ్మె శిబిరం ఏర్పాటు చేసి ఆందోళన చేపట్టారు. మరోవైపు పల్నాడు జిల్లాలో సమ్మె కొనసాగుతుందగా మంగళవారం ఉద్యోగులు భిక్షాటనతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గుంటూరు సమ్మె శిబిరంలో నాయకులు మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, పీఆర్సీ అమలు చేయకుండా, నెలలు తరబడి వేతనాలు విడుదల చేయకపోవడం దుర్మార్గమని మినిమం ఆఫ్‌ టైమ్‌ స్కేల్‌పై జీఓలు మీద జీవోలిచ్చి అమలు చేయట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘాలతో మాట్లాడే సంప్రదాయాన్ని గాలికి వదిలేశారని, ఉద్యోగుల మధ్య విభేదాలు, విభజన సృష్టించే విధానాలు అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒకే క్యాడర్‌ ఉద్యోగులకు రకరకాల వేతనాలు చెల్లిస్తున్నారని, పాత వారికి జీతం పెంచకుండా, కొత్తగా నియమితమైన వారికి జీతం పెంచే సంప్రదాయాన్ని ప్రారంభించారని విమర్శించారు. పార్ట్‌ టైం పేరుతో తక్కువ జీతాలిచ్చే విధానాలను అమలు చేస్తున్నారు. ఎన్నికల సందర్భంగా రెగ్యులర్‌ చేస్తామని, సమాన పనికి సమాన వేతనం ఇస్తామని హామీలు గుప్పించి మాట తప్పారని విమర్శించారు. పెరిగిన ధరలతో ఉద్యోగుల కుటుంబాలు జీవనం సాగించటం కష్టంగా మారిందన్నారు. ఎంఇఒ కార్యాలయాల్లో పనిచేస్తున్న సిఆర్‌ఎంటిలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎంఐఎస్‌ కో-ఆర్డినేటర్లు, అకౌంటెంట్లు, మెసెంజర్లు, సహిత విద్య రిసోర్స్‌ పర్సన్లు, భవిత ఆయ, ఇలా ఆఫీసులు, స్కూల్స్‌లో వివిధ రకాల విధుల్లో ఉన్న ఉద్యోగులందల సమస్యలు పరిష్కరించాలని కోరారు. సమ్మెకు యుటియఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.ఆదిలక్ష్మి, ఎం.కళాధర్‌, ఎస్‌టియు రాష్ట్ర నాయకులు జోసెఫ్‌ సుధీర్‌బాబు, అధ్యక్షులు పెదబాబు, ఎపిటియఫ్‌ జిల్లా అధ్యక్షులు బసవలింగరాజు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజీ, ఏపి గవర్నమెంట్‌ ఉద్యోగుల యూనియన్‌ జిల్లా అధ్యక్షులు చాంద్‌బాషా, ఎన్‌జిఒ నాయకులు మూర్తి, పెన్షనర్లు సంఘం నాయకులు నాగరాజు, సమగ్ర శిక్షా ఏవో శ్రీనివాసరావు, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.దీప్తి మనోజా, నాయకులు టి.రాధ, కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌ జెఎసి జిల్లా చైర్మన్‌ బి.లక్ష్మణరావు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సమగ్ర శిక్షా జెఎసి జిల్లా నాయకులు గంగయ్య, ప్రకాష్‌ ,సతీష్‌, మాధురి పాల్గొన్నారు.

పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో ఉద్యోగులు భిక్షాటనతో నిరసన తెలిపారు. వీరికి యుటిఎఫ్‌, ఎస్‌టియు, సిపిఎం సంఘాలు మద్దతు తెలిపాయి. యుటిఎఫ్‌ జిల్లా గౌరవాధ్యక్షులు కె.శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌టియు జిల్లా అధ్యక్షులు ఎల్‌వి రామిరెడ్డి, ఎపిసిపిఎస్‌ జిల్లా అధ్యక్షులు పి.పిచ్చయ్య మాట్లాడారు. ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తామని, సమాన పనికి సమాన వేతనం ఇస్తామని గత ఎన్నికలకు ముందు హామీనిచ్చినా అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క సమస్యనూ పరిష్కరించలేదని విమర్శించారు. యుటిఎఫ్‌ నాయకులు కె.తిరుపతిస్వామి, టి.సత్యనారాయణ, ఎస్‌టియు నాయకులు నాగవేణు, ముజఫర్‌ రెహ్మాన్‌, సాల్మన్‌, మహబూబ్‌ సుభాని, శ్రీనివాసరావు, అబ్దుల్‌ అజీజ్‌, షేక్‌ కరీముల్లా, శరత్‌ కుమార్‌ సంఘీభావం తెలిపారు. ఉద్యోగులు వై.సుబ్బాయమ్మ, కళ్యాణి, కాంచన, డి.నరసింహస్వామి, పి.నరసింహ నాయక్‌, బి.కోటేశ్వరరావు నాయక్‌, ఎం.శివనాగ ప్రసాద్‌, ఎం.పోతురాజు, పి.రామకృష్ణ, పి.సాంబశివరావు, డి.శ్రీకాంత్‌, షేక్‌ బాషా, ఎన్‌.మంగయ్య, కెవెంకట్‌, డి.లింగయ్య పాల్గొన్నారు.

➡️