సమగ్ర శిక్ష కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమ్మె

Dec 20,2023 20:22

  ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : సమగ్ర శిక్ష కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జెఎసి అధ్వర్యంలో ఉద్యోగులు సమ్మె చేపట్టారు. బుధవారం నుంచి ఉద్యోగులు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన నిరసన దీక్షను ఉద్దేశించి ఆర్‌పిల యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.గురువులు, డేటా ఎంట్రీ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు కార్యదర్శి శ్రీనివాస్‌, ఎంఇఎస్‌ కో ఆర్డినేటర్‌ల అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు ఉమా శంకర్‌, పార్ట్‌ టైం అధ్యాపకుల సంఘం జిల్లా అధ్యక్షులు రవీంద్రబాబు, మండల అకౌంటెంట్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, మెసెంజర్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు గణేష్‌, డిపిఒ అసోసియేషన్‌ అధ్యక్షులు రాంబాబు మాట్లాడారు. విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలు పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. పిఆర్‌సి అమలు చేయకుండా, నెలలు తరబడి వేతనాలు విడుదల చేయకపోవడం దుర్మార్గమన్నారు. మినిమం ఆఫ్‌ టైమ్‌ స్కేల్‌ పై జీఓలు మీద జీవోలు ఇచ్చి, అమలు చేయడం లేదన్నారు. ఉద్యోగుల మధ్య విబేధాలు, విభజన సృష్టించే విధానాలు అమలు చేస్తున్నారని అన్నారు. పాత వారికి జీతం పెంచకుండా, కొత్తగా నియమితమైన వారికి జీతం పంచే సాంప్రదాయాన్ని ప్రారంభించారన్నారు. పార్ట్‌ టైం పేరుతో తక్కువ జీతాలు ఇచ్చే విధానాలను అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తామని, సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తామని, అన్ని విధాలుగా కాంట్రాక్ట్‌, ఔట్సోర్సింగ్‌, పార్ట్‌ టైం ఉద్యోగుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పి, ఒక్క సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం చూపలేదన్నారు. సమగ్రశిక్ష కాంట్రాక్ట్‌, ఔట్సోర్సింగ్‌, పార్టెం ఉద్యోగులు విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్‌ చెయ్యాలని, హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సమగ్రశిక్షా కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (జెఏసి) నాయకులు,ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️