సమస్యలపై ఆశాల 36 గంటల ధర్నా

సమస్యలపై ఆశాల 36 గంటల ధర్నా

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ప్రతినిధితమ సమస్యలు పరిష్కరించాలని ఆశా వర్కర్స్‌ ఎపి ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో నగరంలోని గోకవరం బస్టాండ్‌ వద్ద గల సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద గురువారం 36 గంటల మహా ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ఆశాలు తరలివచ్చారు. ధర్నానుద్దేశించి ఆశ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు కె.పోసమ్మ, కార్యదర్శి కె.ధనలక్ష్మి మాట్లాడారు. గత ఎన్నికల ముందు సిఎం వైఎస్‌.జగన్‌ ఎన్నో హామీలు కురిపించారని, గద్దెనెక్కాక ఒక్క హామీని కూడా అమలు చేయలేదని విమర్శించారు. కోవిడ్‌లో ఇల్లు, కుటుంబాలు వదిలి, ప్రాణాలు సైతం లెక్కచేయక ఆశా వర్కర్లు ప్రజల ప్రాణాలు కాపాడారన్నారు. కోవిడ్‌లో ఆశాలను పొగడ్తలతో ముంచెత్తారు తప్ప నయా పైసా వేతనం పెంచలేదన్నారు. సుప్రీంకోర్టు వేతన కార్మికులందరికీ గ్రాడ్యుటీ ఇవ్వాలని ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం నేటికీ అమలు చేయలేదన్నారు. ఆన్‌లైన్‌ వర్కులు యాప్‌లు, ఇతర వర్కులతో 24 గంటలూ పని చేస్తున్నా వచ్చే రూ.పది వేలతో కుటుంబాలు గడిచే పరిస్థితి లేదన్నారు. నెలలో కనీసం 10 రోజులు ఏదో ఒక మీటింగ్‌ పేరుతో ఇచ్చే జీతంలో సగం ప్రయాణాలకే సరిపోతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఇప్పటికైనా కనీస వేతనం ఇవ్వాలని, వేతనంతో కూడిన మెడికల్‌ లీవ్‌ ఇవ్వాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలని, రాజకీయ వేధింపులు ఆపాలని, ఆన్‌లైన్‌ వర్కులు తగ్గించాలని, సెలవులు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌ మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వం రాష్ట్రంలో ఆశాలు, అంగన్‌వాడీలు, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల్లో పని చేసే స్కీమ్‌ కార్మికులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మీద కక్ష కట్టిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరికి కనీసం మేలు చేసిన దాఖలాలు లేవన్నారు. ఎన్నికల ముందు విపరీతమైన వాగ్దానాలు కురిపించి, ఎన్నికలయ్యాక బోడి మల్లన్న చందంగా జగన్‌ ప్రభుత్వం తీరు ఉందన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజులోవ, కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి జువ్వల.రాంబాబు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎన్‌.రాజా, ఐద్వా జిల్లా నాయకులు టి.సావిత్రి, జరీనా షరీఫ్‌, స్రవంతి, ఆశ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు కె.అన్నామణి, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.బేబీరాణి, ఎం.వెంకటలక్ష్మి, సిపిఎం నగర కార్యదర్శి బి.పవన్‌ మాట్లాడారు. ధనలక్ష్మి, కొండ వెంకటలక్ష్మి, ఐ.వెంకటలక్ష్మి, రాజకుమారి, నాగమణి, హవేల, మేరీ, లక్ష్మి, సత్యవతి, లీల, దుర్గ, కోరుకొండ లక్ష్మి, కుమారి పాల్గొన్నారు.

➡️