సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె ఉధృతం

Jan 7,2024 21:51

ప్రజాశక్తి – పార్వతీపురంటౌన్‌ :తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని మున్సిపల్‌ పారిశుధ్య, ఇంజినీరింగ్‌, వాటర్‌ సెక్షన్‌ కార్మికులు అన్నారు. 13వ రోజు సమ్మెలో భాగంగా, సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ ఆధ్వర్యంలో కార్మికులు ఆదివారం స్థానిక పాతబస్టాండ్‌ కూడలి వద్ద మానవహారం చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా, సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ మాట్లాడుతూ ప్రభుత్వ మొండి వైఖరి నశించాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మున్సిపల్‌ కార్మికులందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌ ఆప్కాస్‌ విధాన ద్వారా కార్మికులందర్నీ రెగ్యులర్‌ చేయాలని, ఇంజనీరింగ్‌ వర్కర్లందరికీ హెల్త్‌ అలవెన్స్‌, రిస్క్‌ అలవెన్స్‌ ఇవ్వాలని, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులు చీపురుపల్లి సింహాచలం, పడాల గాంధీ, మామిడి శివ, బంగారు రాజేషు, గుంట్రెడ్డి గంగయ్యలు, తాడ్డి వినరు, వంగపండు అప్పలనాయుడు, మేడిశెట్టి కృష్ణ, అరసాడ తాతబాబు, నాగవంశం మల్లేసు, బంగారు రవి, నిర్మల ఇప్పలమ్మ, పాపులమ్మ, పడాల సంతు, వెంకన్న, సాయి, రవి, సత్తిరాజు, తదితర కార్మికులు పాల్గొన్నారు.సర్వమత ప్రార్ధనలతో కార్మికుల నిరసనసాలూరు: మున్సిపల్‌ కార్మికుల సమ్మె 13రోజుకు ఆదివారం చేరింది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యాన కార్మికులు ఆదివారం మున్సిపల్‌ కార్యాలయం నుంచి బోసుబొమ్మ జంక్షన్‌ వరకు ర్యాలీ చేపట్టారు. హిందూ, క్రైస్తవ, ముస్లిం దేవుళ్ల పొటోలకు పూజలు చేస్తూ కార్మికులు నిరసన తెలిపారు. సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి మనసు మార్చాలని కోరుతూ కార్మికులు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్‌ పట్టణ అధ్యక్షుడు టి.రాముడు, కార్యదర్శి టి.శంకరరావు, ఫెడరేషన్‌ జిల్లా కార్యదర్శి ఎన్వైనాయుడు మాట్లాడుతూ కార్మికుల సమ్మె పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయడం లేదని అన్నారు. చర్చల పేరుతో కాలయాపన చేస్తోందని ఆరోపించారు. సమస్యలు ఆమోదించే వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు పోలరాజు, టి.రవి, శ్రామిక మహిళా కన్వీనర్‌ టి.ఇందు పాల్గొన్నారు.పాలకొండ : పారిశుధ్య, ఇంజనీరింగ్‌ కార్మికులు చేస్తున్న సమ్మెలో భాగంగా ఆదివారం చెక్‌ పోస్ట్‌ సెంటర్‌లో మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో పడాల భాస్కరరావు, పడాల వేణు, చింతల కైసు, సంజీవి, విమల తదితరులు ఉన్నారు.

➡️