సమస్యలు పరిష్కరించాలని ఎపిటిఎఫ్‌ ధర్నా

Feb 29,2024 21:18

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌, బొబ్బిలి : ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎపిటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు షేక్‌ బుకారిబాబు మాట్లాడుతూ ఉద్యోగులు పొందాల్సిన ఆర్థిక ప్రయోజనాలు సకాలంలో మంజూరు చేయడం లేదు సరి కదా విడుదల చేయడంలోను ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని అన్నారు. 12వ పి.ఆర్‌.సిలో మధ్యంతర భృతి 30 శాతం తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 11వ పి.ఆర్‌.సి బకాయిలు విడతల వారీగా కాకుండా ఏక మొత్తంలో ఒకేసారి చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న రెండు కొత్త డిఎలు తక్షణమే విడుదల చేయాలని కోరారు. టీచర్ల నియామకంలో మళ్లీ ప్రవేశపెట్టిన అప్రెంటిస్‌ విధానం రద్దుచేసి రెగ్యులర్‌ స్కేలులో వారిని నియమించాలని డిమాండ్‌ చేశారు.ధర్నా లో సంఘం నాయకులు పి.శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగ, పింఛనుదారుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని పాత తాలూకా కేంద్రం బొబ్బిలిలో ఎపిటిఎఫ్‌ ఆధ్వర్యాన ధర్నా చేశారు. వీరికి పింఛనుదారులు, ఉద్యోగులు మద్దతు ప్రకటించారు. పింఛనుదారుల సంఘం రాష్ట్ర నాయకులు రౌతు రామ్మూర్తి నాయుడు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఉద్యోగుల నమ్మకాన్ని కోల్పోయిందన్నారు. అనంతరం తహశీల్దార్‌కు వినతి అందించారు. ఎపిటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు జె సి రాజు, జిల్లా నాయకులు జోగినాయుడు, పీటర్‌, మండల అధ్యక్షులు ప్రవీణ్‌ కుమార్‌, ఎల్లయ్య, సుధాకర్‌, రామకృష్ణ పాల్గొన్నారు.

➡️