సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాడాలి

Jan 28,2024 21:47

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల పట్ల అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గిరిజనుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాలని ఆదివాసి జెఎసి జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. ఆదివారం స్థానిక ఐటిడిఎ గిరిజన సామాజిక భవనంలో నిర్వహించిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడారు. పీసా చట్టం 7/98 స్వయం పాలన ఉద్దేశించిన పీసా కమిటీ ఎన్నికలు జరపవద్దని, గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్‌ ఇచ్చిన ఆదేశాలు రద్దుచేసి కమిటీ ఎన్నికలు జరుపాలని కోరారు. ఎల్‌టిఆర్‌ 1/70 చట్టం రద్దు చేసేందుకు గిరిజనేతరులు సుప్రీంకోర్టులో వేసిన కేసుపై ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయాలని, షెడ్యూల్డ్‌ ఏరియాలో నాన్‌ ట్రైబుల్స్‌ 1.1/2 సెంటు పొజిషన్‌ సర్టిఫికేట్లు మంజూరుకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు సిఎంఒ నోట్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కోనేరు రంగారావు కమిటీ జిఒ అమలు చేసి షెడ్యూల్డ్‌ ఏరియాలో అక్రమ వలసలు నివారించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. జిఒ 3 బదులుగా కొత్తరెగ్యులేషన్‌, షెడ్యూల్డ్‌ ప్రాంతాలన్నీ ట్రైబల్‌ ఎడ్వయిజరీ కమిటీ ద్వారా ప్రత్యేక పరిపాలన యంత్రాంగం ఏర్పాటు చేయాలని, జగనన్న భూహక్కు పథకం షెడ్యూల్డ్‌ ఏరియాలో 1970 కాకుండా 1959 ప్రామాణికంగా తీసుకోవాలని కోరారు. టిఎసిలో సభ్యులందర్నీ గిరిజనులనే నియమించి అవసరమైన చట్టాలు రూపొందించాలని కోరారు. నకిలీ ఎస్‌టి ధ్రువపత్రాలు రద్దుపై ప్రత్యేక కమిటీ నియమించి త్వరితగతిన విచారణతో పాటు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్‌టి రిజర్వుడు నియోజక వర్గాల్లో నిజమైన ఎస్‌టిలకే సీట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. బోయవాల్మీకిలను, ఏ ఇతర కులాలను ఎస్‌టిలో చేర్చకుండా టిఎసి తీర్మానం చేసి కేంద్రప్రభుత్వానికి పంపడం, సత్యపాల్‌, షామీల్‌ ఆనంద్‌ కమిటీ రిపోర్టు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జెఎసి చైర్మన్‌ కె.ధర్మారావు, వైస్‌ చైర్మన్‌ ఎ.నీలకంఠం, నాయకులు దుక్క సీతారాం, కె.ఉదరు, కె.గౌరమ్మ, కె.జయమ్మ, వివిధ గిరిజన సంఘాలకు చెందిన సభ్యులు పాల్గొన్నారు.

➡️