సమస్యల పరిష్కారానికి వికలాంగుల ధర్నా

Mar 4,2024 21:38

ప్రజాశక్తి – సీతానగరం : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్థానిక ఎంపిడిఒ కార్యాలయం వద్ద వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్‌ పి ఆర్‌ డి )ఆధ్వర్యంలో వికలాంగులు ధర్నా చేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా కన్వీనర్‌ గవర వెంకటరమణ మాట్లాడుతూ పార్లమెంట్లో 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని ఆమోదించారు, కానీ హక్కుల పరిరక్షణ చట్టంలో ఉన్న అంశాలను మాత్రం నేటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆచరణలో అమలు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వికలాంగుల సమస్యలపై నిర్లక్ష్యం వ్యవహరించడం తగదని, పార్లమెంట్లో ఆమోదించిన వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. వికలాంగులకు తక్షణమే ఇళ్లు మంజూరు చేయాలని, ప్రతి నెలా పెన్షన్‌ రూ.6వేలు మంజూరు చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్‌ సంస్థలకు రెడ్‌ కార్పెట్‌ పరుస్తూ, టాక్సుల్లో రాయితీలు కల్పిస్తూ, వికలాంగులకు ఫెన్షన్‌ పెంచాలంటే నిధుల్లేవని చెప్పడం విడ్డూరమని అన్నారు. ఢిల్లీలో రైతులు చేపడుతున్న ఉద్యమస్ఫూర్తితో వికలాంగుల సైతం హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఆసరా పెన్షన్లు మంజూరుకు ప్రభుత్వం విధించిన ఆదాయ పరిమితిని ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం నియమిస్తున్న నామినేటెడ్‌ పోస్టుల్లో 5%శాతం వికలాంగులకు కేటాయించేలా చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాల్లో మొదటి ప్రాధాన్యతగా వికలాంగులకు అవకాశం కల్పించాలని, నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి కోసం ఎలాంటి షరతుల్లేకుండా రూ.10లక్షలు ఆర్థిక సాయం అందజేయాలన్నారు. కార్యక్రమంలో వికలాంగులు నక్క త్రినాధ, రాయిపల్లి భాస్కరరావు, అడివియ్య జానకి, దమయంతి, గౌతమి తదితర వికలాంగులు పాల్గొన్నారు.

➡️