సర్వ కళల సమాహారమే బుర్రకథ

Feb 5,2024 00:03

బుర్రకథ పితామహుడు పద్మశ్రీ షేక్‌ నాజర్‌ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న బాబూజీ, బాలోత్సవ కమిటీ సభ్యులు
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : సర్వ కళల సమాహారమే బుర్రకథని, ప్రజల అవసరాలు తీరిస్తేనే ఏ కళకైనా మనుగడ ఉంటుందని బుర్రకథ అధ్యాపకులు, కళారత్న షేక్‌ బాబూజి అన్నారు. బుర్రకథ పితామహుడు పద్మశ్రీ షేక్‌ నాజర్‌ 124 జయంతి సందర్భంగా పల్నాడు బాలోత్సవం కమిటీ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని టైనీటాట్స్‌ కిండర్‌జారు పాఠశాలలో బుర్రకథలపై వర్క్‌షాప్‌ ఆదివారం జరిగింది. బాబూజి మాట్లాడుతూ బావి భారత పౌరులకు సంస్కృతి కళారూపాలు అందించేందుకు బాలోత్సవాల కమిటి చేస్తున్న కృషి మరువలేనిదన్నారు. పిల్లలు స్వచ్ఛమైన తెలుగు భాష మాట్లాడాలంటే కళలు, సంస్కృతీ సంప్రదాయాలను అలవర్చాల్సిన అవసరం ఉందన్నారు. కళారూపాలు, సాహిత్యాలు, ఆడడం, పాడడం ద్వారా మనసు స్థిరత్వానికి, జ్ఞాపకశక్తి పెరగడానికి దోహదం చేస్తుందని వివరించారు. నేటి యువత జీవన విధానానికి కళలను తోడు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అప్పుడవి మానసిక ఉత్తేజాన్ని, ప్రశాంతతను కలిగిస్తాయని, హాస్యం, సంస్కృతి, సంప్రదాయాలు, రాజకీయం, పాటలు ఆనందం ఇముడింప చేస్తాయని, పరభాషలు నేర్చుకునేందుకు కళలు దోహదం చేస్తాయని వివరించారు. కథాగాన కళారూపాల ద్వారా ప్రజలు కొత్త ఆలోచనలతో తమ సమస్యల పరిష్కారానికి మార్గాలు కనిపిస్తాయన్నారు. బాలోత్సవాల కమిటీ అధ్యక్షులు, ఆక్స్‌ఫర్డ్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ డైరెక్టర్‌ రాజారెడ్డి మాట్లాడుతూ గతేడాది నిర్వహించిన బాలోత్సవాల్లో 62 రకాల కళారూపాలు ప్రదర్శన చేపట్టగా బుర్రకథకు సంబంధించి తక్కుమంది విద్యార్థులు వచ్చారని, దీన్ని పరిపూర్తి చేయడానికి వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేశామని అన్నారు. పల్నాడు బాలోత్సవం ద్వారా ప్రతినెలా ఒక కార్యక్రమం నిర్వహించి సంస్కృతి, సంప్రదాయాలు, కళల పట్ల విద్యార్థులలో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. కమిటీ ప్రధాన కార్యదర్శి కట్టా కోటేశ్వరరావు మాట్లాడుతూ బుర్రకథల కళారూపం పునరుద్ధరణ జరగాలంటే ప్రజల అవసరాలకు అనుగుణమైన ఇతివృత్తాలతో ముందుకెళ్లాలన్నారు. జానపద కళారూపాలను బతికించుకోవాల్సిన అవసరాన్ని ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలు గుర్తించాలని కోరారు. విశ్వవిద్యాలయాల్లో కళలకు సంబంధించిన సిద్ధాంత గ్రంథాలకు, సిద్ధాంతకారులకు ఇచ్చే ప్రోత్సాహకాలు, కళాకారులను తయారు చేసే, శిక్షణ కోసం ఉద్దేశించిన గ్రంథాలు తయారు చేసే వారికి ప్రోత్సాహం లభించడం లేదని తెలిపారు. ఏ కళకైనా సిద్ధాంత పరమైన గ్రంథాలు ఎన్ని ఉన్నా దాన్ని నేర్పే విధానం తెలియకపోతే నిరుపయోగమన్నారు. బాలబాలికలు అభ్యుదయ భావాలతో కూడిన ఇతివృత్తాన్ని ఎంచుకొని, బుర్రకథలను సాధన చేస్తే మేడే రోజున బుర్రకథ మేళాను నిర్వహిస్తామని ప్రకటించారు. ఆ మేళాకు బాలబాలికలు అంతా సన్నద్ధం కావాలని, పాల్గొనే వారికి బహుమతులు, ప్రశంసాపత్రాలు ప్రదానం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో బాలోత్సవం కమిటీ గౌరవాధ్యక్షులు ఎం.ఎస్‌ఆర్‌.కె ప్రసాద్‌, పల్నాడు బాలోత్సవం కమిటీ సభ్యులు కె.రామారావు, ఎం.సాంబశివరావు, ఎ.లక్ష్మీశ్వరరెడ్డి, టి.అంజిరెడ్డి మాస్టారు, టి.యోహాన్‌ రాజు, ఎస్‌.రామిరెడ్డి, కె.శివపార్వతి, బి.సలీం, టైనిటాట్స్‌ డైరెక్టర్‌ పి.కోటేశ్వరమ్మ, చినఓబయ్య, ఏసుదయ పాల్గొన్నారు.

➡️