సవరభాషా వాలంటీర్లను కొనసాగించాలి

Mar 4,2024 21:41

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : సవర భాష వాలంటీర్లను కొనసాగించకపోవడంతో 50 గిరిజన గూడేల విద్యార్థులు చదువుకు దూరమయ్యారని, వెంటనే వారి కొనసాగింపునకు చర్యలు చేపట్టాలని యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌ మురళీమోహన్రావు డిమాండ్‌ చేశారు. సోమవారం పార్వతీపురం, సీతంపేట ఐటిడిఎల పరిధిలో గల 50 గ్రామాలకు చెందిన సవర భాషా విద్యా వాలంటీర్లు తమను మార్చి, ఏప్రిల్‌ నెలల్లో కొనసాగించాలని కోరుతూ స్థానిక కలెక్టరేట్‌ వద్ద రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మురళీమోహన్‌ మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న అనాలోచితం నిర్ణయం వల్ల 50 గ్రామాల (గూండలు) గిరిజన విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడిందన్నారు. చిన్న చిన్న సవర గూడల విద్యార్థులను భాషా వాలంటీర్లు సమీప రెగ్యులర్‌ పాఠశాలకు తీసుకెళ్ళి చదువు చెప్పే వారని, ఇప్పుడు వారిని కొన సాగించకపోవడం వల్ల చిన్న చిన్న సవరగూడల విద్యార్థులు బడికి వెళ్లకుండా ఊరిలో ఉండిపోతున్నారని అన్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌ రాష్ట్ర ఎస్‌ఎస్‌ఎం అధికారులతో మాట్లాడి సవర భాష వాలంటీర్లను ఈ కొనసాగింపునకు వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కొనసాగింపునకు చర్యలు చేపట్టని పక్షంలో ఈనెల 11న చలో కలెక్టరేట్‌ నిర్వహిస్తామని భాష వాలంటీర్ల సంఘం నాయకులు డుంబు వెంకటేష్‌ ప్రకటించారు.

➡️