సాగులోనే ఉన్నాం.. పట్టాలిప్పించండి

ప్రజాశక్తి- మెంటాడ : మండలంలోని పెదమేడపల్లి గ్రామ శివారులో సర్వే నెంబర్‌ 402/1, 402/2గల కొండ పోరంబోకు భూమిని మాదిగ కులానికి చెందిన దళితులు సుమారు 120 కుటుంబాలు గత కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్నారు. అదే గ్రామానికి చెందిన అగ్రకులాలు వీరిని భయభ్రాంతులకు గురిచేస్తూ సాగు ఆటంకానికి గొడవలు రేపుతున్నారు. ఈ విషయం కోర్టు పరిధిలో ఉందని జిల్లా స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు తమకు అనుకూలంగా ఉన్నప్పటికీ గ్రామ నాయకులు మండల స్థాయి నుండి దిగువ స్థాయి అధికారులు తమకు ఆటంకాలు కల్పిస్తూ పట్టాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వైసిపి ఎస్‌సి సెల్‌ మండల అధ్యక్షులు వడ్డీ జనార్దన్‌ రావు అన్నారు. గురువారం సదరు స్థలంలో ఒక్కొక్కరికి 18 సెంట్లు చొప్పున కేటాయించుకొని సాగు చేస్తున్న భూమిలో గట్లు వేస్తూ సదును చేసుకున్నారు. ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ళగా కొండ పోరంబోకు భూమిని చదును చేసుకుని వివిధ రకాల మొక్కలు నాటుకుని అనుభవిస్తున్నామని తాము దళితులమనే చిన్న చూపుతో ఎంతమంది మండల స్థాయి అధికారులు మారినప్పటికీ తమకు పట్టాలు ఇవ్వటానికి ఎందుకు సముకుతం చూపించడం లేదో అర్థం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 25వ తేదీ లోపు అధికారులు స్పందించి పట్టాలు ఇవ్వకపోతే ఇదే గ్రామం నుండి దళిత కుటుంబాలు అన్ని విజయనగరం గ్రీవెన్స్‌కు పాదయాత్రగా బయలుదేరి పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత ఐక్యవేదిక జిల్లా కార్యదర్శి వడ్డీ చిన్నారావు, సున్నపు ప్రసాద్‌, వడ్డీ లక్ష్మణరావు, వడ్డీ అప్పలనాయుడు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

➡️