సిఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్ష

సిఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్ష

ప్రజాశక్తి-కాకినాడపెన్షన్‌ పెంపు కార్యక్రమంలో భాగంగా జనవరి 3న కాకినాడలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను సమన్వయంతో చేపట్టాలని కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. శనివారం కాకినాడ కలెక్టరేట్‌లో సమావేశ మందిరంలో కలెక్టర్‌ అధ్యక్షతన సిఎం పర్యటనకు చేపట్టవలసిన చర్యలపై ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంఎల్‌సి, సిఎం పర్యటనల సమన్వయకర్త తలశిల రఘరామ్‌, కాకినాడ ఎంపీ వంగా గీత, కలెక్టర్‌ కృతికా శుక్లా, కాకినాడ సిటీ ఎంఎల్‌ఎ ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి, కాకినాడ రూరల్‌ ఎంఎల్‌ఎ కురసాల కన్నబాబు, పిఠాపురం ఎంఎల్‌ఎ పెండెం దొరబాబు, హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దవులూరి దొరబాబు, ఎస్‌పి ఎస్‌.సతీష్‌ కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియ పాల్గొన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్‌ కతికా శుక్లా మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రజలు, లబ్దిదారులు తరలి వచ్చేందుకు అవసరమైన రవాణా వాహనాలను ఏర్పాటు చేయాలని డిటిసిని ఆదేశించారు. వాహనాల రూట్లు, పార్కింగ్‌, ట్రాఫిక్‌ నియంత్రణ, బందోస్తు ఏర్పాట్లపై పోలీసు శాఖకు పలు సూచనలు చేశారు. మఖ్యమంత్రి పర్యటనలో రోడ్‌ షో, బహిరంగ సభల వద్ద పటిష్టమైన బారికేడింగ్‌ ఏర్పాటుకు రోడ్లు భవనాల ఎస్‌ఇని ఆదేశించారు. హెలిపాడ్‌, రోడ్‌ షో, బహిరంగ సభల వద్ద అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక మెడికల్‌ క్యాంపులు, కాన్వారులో వైద్యాధికారులతో కూడిన అంబులెన్స్‌ ఏర్పాటు చేయాలని డిఎంహెచ్‌ఒకు సూచించారు. ఎస్‌సి ఎస్‌.సతీష్‌ కుమార్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాహనదారులకు ముందుగానే ఏ ప్రదేశంలో వాహనాలు పార్కింగ్‌ చేసుకోవాలో సమాచారం అందించాలని పోలీసు అధికారులకు సూచించారు. ట్రాఫిక్‌ ను క్రమబద్ధీకరించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు. సమన్వయకర్త తలశిల రఘురామ్‌ మాట్లాడుతూ సిఎం పర్యటనకు హాజరయ్యే ప్రజలు, లబ్ధిదారులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని సదపాయాలూ కల్పించాలని అధికారులను కోరారు. అంతకు ముందు ఆయన ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో కలిసి ముఖ్యమంత్రి పాల్గొనే బహిరంగ ప్రదేశం రంగరాయ క్రీడా మైదానం, హెలిప్యాడ్‌ నిమిత్తం జిల్లా పోలీసు మైదానం, రోడ్స్‌ షో నిర్వహించే ప్రదేశాలను పరిశీలించి అవసరమైన ఏర్పాట్లను సూచించారు. ఈ సమావేశంలో కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ సిహెచ్‌ నాగనరసింహారావు, జెడ్‌పి సిఇఒ ఎ.రమణారెడ్డి, ఇన్‌ఛార్జి డిఆర్‌ఒ కె.శ్రీరమణి, కాకినాడ పెద్దాపురం ఆర్‌డిఒలు ఇట్ల కిషోర్‌, జే.సీతారామరావు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

➡️