సిఎఎను వ్యతిరేకిద్దాం.. దేశాన్ని కాపాడుకుందాం

ప్రజాశక్తి – కడప అర్బన్‌ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా, దేశ సమైక్యత సమగ్రతకు నష్టం కలిగించే సిఎఎను రద్దు చేసే వరకు పోరాడాలని వామపక్ష నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన సదస్సులో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి. చంద్ర, సిపిఎం జిల్లా కార్యదర్శి జి. చంద్రశేఖర్‌, సిపిఐ ఎంఎల్‌ డబ్ల్యూ రాము, రమణయ్య మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం 2019లో పార్లమెంట్‌లో ప్రతిపక్షాల నిరసనల మధ్య ఆమోదింప జేసుకున్న ‘పౌరసత్వ సవరణ చట్టం’ (సిఎఎ) ఆనాటి ప్రజా ఉద్యమాల ధాటికి తాత్కాలికంగా అమలు చేయలేకపోయిందని తెలిపారు. 5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఆ చట్టాన్ని అమలులోకి తెచ్చిందని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను పక్కదారి పట్టించి, వైషమ్యాలు రెచ్చగొట్టి, మతకలహాలు సష్టించి అధికారమే ధ్యేయంగా హిందువుల ఓట్లను కొల్లగొట్టేందుకు, నరమేధానికి తెగబడుతుందని ఆరోపించారు. బిజెపి హిందూత్వ వ్యవస్థను ఏర్పాటు చేయడానికే ఈ ప్రయత్నమని తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగం మౌలిక స్వరూపానికి విఘాతం కలిగిస్తుందని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని అధికరణలు 14, 15, 16, 25లను ఉల్లంఘిస్తుందని చెప్పారు. ముస్లిములు అధికంగా ఉన్న పొరుగు దేశాలలో పీడనకు గురవుతూ, శరణార్ధులుగా వచ్చిన వారిని కాపాడేందుకు ఈ చట్టం తెచ్చామని ప్రజల్ని నమ్మించే ప్రయతం చేస్తున్నారని చెప్పారు. ఇది ఎంతమాత్రం నిజంకాదని తెలిపారు. మరి శ్రీలంక, బూటాన్‌, మయన్మార్‌లో పీడనకు గురవుతూ శరణార్ధులుగా వస్తున్న వారికి ఎందుకు రక్షణ కల్పించటంలేదని ప్రశ్నించారు. రక్షణ కల్పించటం కొందరికి మాత్రమే వర్తించే సూత్రం అవుతుందా అని ప్రశ్నించారు. మతం ఆధారంగా పౌరసత్వం ఇవ్వటం ప్రజాస్వామ్య విలువలకు, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతని పేర్కొన్నారు. ఈ దేశంలో నివసిస్తున్న హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు, జైనులు, బౌద్దులు, సిక్కులు ఇలా అన్ని మతాలవారూ భారతీయులే అన్నారు. ఈ దేశ ప్రజల మధ్య చీలికలు తెచ్చి భారతదేశ విచ్ఛిన్నానికి, వినాశనానికి ప్రయత్నిస్తున్న బిజెపి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సిఎఎ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌కు వ్యతిరేకంగా దేశ సమగ్రతను కాపాడుకుంటూ, రాజ్యాంగ పరిరక్షణకోసం ఐక్యంగా పోరాడుదామని పిలుపునిచ్చారు. సమావేశంలో సిపిఐ, సిపిఎం నగర కార్యదర్శులు ఎన్‌.వెంకట శివ, రామ్మోహన్‌,సుబ్రహ్మణ్యం, వీరశేఖర్‌, అన్వేష్‌, కే.సీ.బాదుల్లా, బి.మనోహర్‌, శ్రీనివాసులు రెడ్డి, దస్తగిరి రెడ్డి, గంగా సురేష్‌, శివకుమార్‌, వలరాజు, చిన్ని, మునయ్య, భాగ్యలక్ష్మి, శంకర్‌ నాయక్‌, శివశంకర్‌ పాల్గొన్నారు.

➡️