సిఎస్‌ఆర్‌ నిధులతో ఆసుపత్రి నిర్మాణం

Jan 6,2024 22:58
సిఎస్‌ఆర్‌ నిధులతో ఆసుపత్రి నిర్మాణం

ప్రజాశక్తి-కాకినాడపట్టణంలోని 10వ డివిజన్‌లో రూ.1.89 కోట్ల సిఎస్‌ఆర్‌ నిధులతో వైఎస్సార్‌ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించినట్టు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికాశుక్లా తెలిపారు. శనివారం డివిజన్‌లోని తారకరామ నగర్‌, దుమ్ముల పేటలో కాకినాడ సీ పోర్టు సౌజన్యంతో నిర్మించిన ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్‌, ఎంపీ వంగాగీత, ఎంఎల్‌సి కర్రి పద్మశ్రీ, ఎంఎల్‌ఎ ద్వారంపూడి చంద్రశేఖర్‌, కాకినాడ సీ పోర్టు ఎమ్‌డి కెవి.రావు, కుడా చైర్‌పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి మాజీ మేయర్‌ సుంకర శివ ప్రసన్న, మున్సిపల్‌ కార్పొరేషన్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ డివిజన్‌లో వైద్య సేవలు నిమిత్తం గతంలో రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సి వచ్చేదన్నారు. సీ పోర్టు సిఎస్‌ఆర్‌ నిధులు రూ.1.89 కోట్లతో ఈ వైద్య శాలను నిర్మించినట్టు చెప్పారు. నిర్మాణ పనులు కేవలం ఏడు నెలల కాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిన కాకినాడ సీ పోర్టు లిమిటెడ్‌కు కలెక్టర్‌ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య సేవలు చేరువ చేయాలనే ఉద్దేశంతో నిర్మించిన ఆసుపత్రుల ద్వారా ప్రజలకు మంచి వైద్య సేవలు అందుబాటులో వున్నాయని ఈ సదుపాయాలు నగర వాసులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ కోరారు. ఎంపీ వంగా గీత మాట్లాడుతూ సిఎం వైఎస్‌.జగన్‌ ప్రజారోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కల్పన, ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టారన్నారు. ఎంఎల్‌ఎ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కమిషనర్‌ సిహెచ్‌.నాగనరసింహారావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ జెనరసింహ నాయక్‌, ఎంహెచ్‌ఒ డాక్టర్‌ పృథ్వీచరణ్‌, మురళీధర్‌, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

➡️