సిఐటియు నాయకుడిపై పోలీసుల దాడి

Jan 20,2024 00:54

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పెండ్యాల మహేష్‌
ప్రజాశక్తి-సత్తెనపల్లి : సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు పూనుకున్న అధికారులు… విధుల్లో చేరాలని అంగన్వాడీలను బెదిరించడమే కాగా ప్రశ్నించిన సిఐటియు నాయకుడు ఆస్పత్రి పాలయ్యేలా అధికారులు, పోలీసులు జులం ప్రదర్శించారు. వివరాల ప్రకారం.. పట్టణంలోని ఐసిడిఎస్‌ ప్రాజక్టు కార్యాలయం వద్దకు శుక్రవారం రాత్రి ఏడు గంటల తర్వాత అంగన్వాడీలను అధికారులు పిలిపించారు. వారిని బెదిరించే ధోరణిలో మాట్లాడి తాము విధుల్లో చేరతామంటూ బలవంతంగా సంతకాలు సేకరిస్తున్నారు. ఇది తెలిసిన సిఐటియు మండల కార్యదర్శి పెండ్యాల మహేష్‌ అక్కడికి చేరుకుని అధికారులను నిలదీశారు. కార్యాలయం పని వేళలు కాని సమయంలో అంగన్వాడీలను ఎందుకు పిలిపించారని, బెదిరించి సంతకాలు తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో కార్యాలయ అధికారులు పట్టణ పోలీసులుకు సమాచారం ఇవ్వడంతో వారొచ్చి మహేష్‌పై దాడికి పాల్పడ్డారు. కాళ్లుతో తన్నుకుంటూ, పిడిగుద్దులు గుద్దుతూ జీపులో ఎక్కించారు. స్టేషన్‌లో కొంతసేపు ఉంచి వ్యక్తిగత పూసికత్తుపై విడుదల చేశారు. స్టేషన్‌ నుండి బయటకు వచ్చిన మహేష్‌ అప్పటికే పోలీసుల దాడి వల్ల నీరసించి సొమ్మసిల్లి పడిపోయాడు. ఆయన్ను తోటి కార్యాకర్తలు సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న సిపిఎం నాయకులు జి.బాలకృష్ణ, టి.రాము, జి.రజిని, కె.శివదుర్గారావు ఆస్పత్రిలోని మహేష్‌ణు పరామర్శించారు. పోలీసుల దాడిని, అధికారుల తీరును సిఐటియు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఆంజనేయ నాయక్‌ తీవ్రంగా ఖండించారు.

➡️