సిట్‌ వేసి భూ ఆక్రమణలపై చర్యలు చేపట్టాలి

ప్రజాశక్తి-కనిగిరి: కనిగిరిలో జరుగుతున్న భూ ఆక్రమణలపై సిట్‌ వేసి విచారణ జరిపి ఆక్రమణదారులపై కఠిన చర్యలు చేపట్టాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్‌ పిసి కేశవరావు డిమాండ్‌ చేశారు. కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని అర్బన్‌ కాలనీ సమీపంలో సర్వే నెంబర్‌ 29లోని 4.60 ఎకరాల స్థలంలో అక్రమంగా చేపడుతున్న నిర్మాణాలను గురువారం అడ్డుకున్నారు. భూ అక్రమణాలపై తహశీల్దారుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెలిప్యాడ్‌ స్థలాన్ని కేతినేని తిరుపతయ్య ఆక్రమించుకొని నకిలీ పట్టాలు సృష్టించి విక్రయాలు చేపడుతున్న, అక్రమ నిర్మాణాలు జరుగుతున్న అధికారులకు పట్టలేదని విమర్శించారు. శంఖవరం రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్‌ 194-2లో నాగుల చెరువు కొండవాగును ఆక్రమించుకొని నిర్మాణాలు చేపడుతున్నారని, అదేవిధంగా ఒంగోలు మార్గంలోని సురా పాపిరెడ్డి నగర్‌లో వాగు పోరంబోకు భూమిని ఏఎంసి సిబ్బంది బెంజిమెన్‌ అతని సోదరులు ఆక్రమించి విక్రయాలు చేపడుతున్న అధికారులకు చలనం లేదని విమర్శించారు. అదేవిధంగా పేదలకు పంపిణీ చేసిన భూములను సైతం ఆక్రమణదారులు ఆక్రమించుకుంటూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, ఫలితంగా వారు భూములను కోల్పోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. అసైన్మెంట్‌ భూములలో నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు వేస్తూ విక్రయాలకు పాల్పడటం వలన అమాయక ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేసి నష్టపోతున్నారని అన్నారు. ఈపాటికి జిల్లా అధికారులను కలిసి అక్రమాలపై చర్యలు చేపట్టాలని వినతి పత్రాలు సమర్పించడం జరిగిందని పేర్కొన్నారు. భూ అక్రమాలపై చర్యలు చేపట్టకపోతే పెద్దఎత్తున ఆందోళన చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌కే బషీర, వి కాశయ్య, పి నరేంద్ర, ఎన్‌ రవణమ్మ, ఆర్‌ ఏడుకొండలు పాల్గొన్నారు.

➡️