సిపి పరిశ్రమ వద్ద కార్మికుల నిరసన

Jan 29,2024 20:51

ప్రజాశక్తి – పూసపాటిరేగ  :  మండలంలోని సిపి ఆక్వా రొయ్యమేత పరిశ్రమ వద్ద కార్మిక నాయకుడు నల్ల అప్పలరాజు ఆధ్వర్యంలో కార్మికులు కుటుంబాలతో సహ సోమవారం నిరసన చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అకారణంగా తొలగించిన 48 మంది కార్మికులను విధుల్లోకి తీసుకునేంతవరకూ శాంతియుత పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. స్ధానికులకు పనిలేకుండా చేయడం అన్యాయమన్నారు. యాజమాన్యం మంచిగా ఉన్నా అందులో కాంట్రాక్టర్‌లు లక్ష్మినారాయణ, వైస్‌ ఎంపిపి సత్యనారాయణ రాజు కార్మికులకు వ్యతిరేకంగా ఉండడం అన్యాయమన్నారు. వారి పబ్బం గడుపుకోవడానికి కార్మికులను బలిచేస్తున్నారన్నారు. వారి మాట విని యాజమాన్యం కూడా మొండి వైఖరితో కార్మికులను పనిలోకి తీసుకోవడంలో జాప్యం చేస్తుందన్నారు. ఈ పరిశ్రమ వల్ల తమ నేలలు, నీరు, గాలి కాలుష్యం అయ్యాయన్నారు. తమకు పని ఇవ్వకపోతే కాలుష్యం రాకుండా నివారించుకోవాలన్నారు. పరిశ్రమలో ప్రభుత్వ భూమి 6.47 సెంట్లును ప్రభుత్వం స్వాదీనం చేసుకోవాలన్నారు. దీనిపై తామే చట్టపరంగా పోరాటం చేస్తామన్నారు. తమకు సహకారం లేని కంపెనీకి మేమెందుకు సహకారంగా ఉండాలన్నారు. సమస్య పెద్దది చేసుకోకుండా పరిష్కరించుకోవాలన్నారు. లేకపోతే బారీ పోరాటం తప్పదని హెచ్చరించారు. నిరసనలో కార్మిక కుటుంబాలు పాల్గొన్నాయి.

➡️