సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్‌ హిమబిందు

ప్రజాశక్తి -సీలేరు

ఆదివాసీలు సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ధారకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డీకే హిమబిందు అన్నారు. శనివారం ఫ్యామిలీ ఫిజీషియన్‌లో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గుమ్మిరేవుల పంచాయతీ పరిధి చెరుకుమల్లు గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. తొలుత వైద్యాధికారి ఆదివాసీల గృహాల వద్దకు వెళ్లి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. 112 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. గర్భిణులకు ప్రత్యేక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి హిమబిందు మాట్లాడుతూ గిరిజనులు సీజనల్‌ వ్యాధులపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. చలితో కూడిన జ్వరం వస్తే వెంటనే ఆసుపత్రికి వచ్చి రక్త పరీక్ష చేయించుకోవాలని సూచించారు. మలేరియా నిర్ధారణ జరిగితే క్రమంగా మందులు వేసుకోవాలన్నారు. గర్భిణులు తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ప్రసవ సమయానికి ముందుగానే ఆసుపత్రిలో చేరాలని సూచించారు. ఆసుపత్రికి దూరంగా ఉన్న గర్భిణులు ప్రసవ సమయానికి 10 రోజుల ముందు చింతపల్లి గర్భిణుల వసతి మృహంలో చేరి సుఖ ప్రసవం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌హెచ్‌పి లోవ కుమారి, ఏఎన్‌ఎం మత్స్య కొండ, సీత పాల్గొన్నారు.

➡️