సీతంలో జిల్లా స్థాయి యూత్‌ పార్లమెంట్‌

Mar 2,2024 20:36

ప్రజాశక్తి-విజయనగరం :  సీతం ఇంజినీరింగ్‌ కళాశాలలో జిల్లా నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యాన శనివారం జిల్లాస్థాయి యూత్‌ పార్లమెంట్‌ విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా జిల్లా యువజన అధికారి ఉజ్వల్‌ మాట్లాడుతూ విద్యార్థుల నైపుణ్యాలు, సహ పాఠ్యాంశాలను పెంపొందించుకోవాలని, కరెంట్‌ అఫైర్స్‌లో పాల్గొని రాజకీయాలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. మెడికల్‌ కౌన్సిలర్‌ త్రినాథ్‌ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య సమస్యలపై అవగాహన కలిగి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. జిల్లా ఉపాధి అధికారి బి.అరుణ మాట్లాడుతూ యువతకు ప్రభుత్వం కల్పిస్తున్న ఉద్యోగావకాశాలు ఎన్నో ఉన్నాయని అన్నారు. సెట్విజ్‌ సిఇఒ రామగోపాలరావు మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో విజయం సాధించేందుకు పోటీతత్వాన్ని పెంచుకోవాలని సూచించారు. బాలల హక్కుల చైర్మన్‌ కేసలి అప్పారావు మాట్లాడుతూ విద్యార్థులు పోటీతత్వాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు. సీతం డైరెక్టర్‌ డాక్టర్‌ మజ్జి శశిభూషణరావు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు సామాజిక అంశాలలో చురుగ్గా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ డివి రామమూర్తి తదితరులు పాల్గొన్నారు.

➡️