హవ్వా! నవ్విపోదురుగాక

Mar 29,2024 21:49

 ప్రజాశక్తి-రేగిడి : రోగమొకటి అయితే..మందు మరొకటి ఇచ్చిన చందంగా ఉంది అధికారుల తీరు. ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతుంటే, అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు చూసీచూడనట్లు వదిలేశారు. దీనిపై పత్రికలో కథనం రావడంతో మరోదారి లేక తూతూ మంత్రంగా తనిఖీలు చేశారు. తీరా అక్రమానికి అడ్డుకట్ట వేయాల్సిన సమయంలో ‘అధికార’ం అడ్డు కనిపించినట్లుంది. ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న చోట ట్రెంచ్‌లు తవ్వడం మానేశారు. మరోచోట ట్రెంచ్‌లు తవ్వి చేతులు దులుపుకున్నారు. దీంతో అధికారుల తీరుపై మండల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.మండలంలోని రేగిడి, ఖండ్యాం పంచాయతీ పరిధి కొమిరి, వెంకటాపురం వద్ద నాగావళి నదిలో అక్రమ ఇసుక రవాణాపై ‘ప్రజాశక్తి’లో ఇటీవల కథనం రావడంతో రెవెన్యూ అధికారులు దాడులు చేపట్టారు. గదబవలస నాగావళి నది వద్ద నుంచి వందలాది ట్రాక్టర్లు, లారీలతో ఇసుక అక్రమ రవాణా సాగడాన్ని ప్రజాశక్తి వెలుగులోకి తెచ్చింది. ఆర్‌డిఒ శాంతి, మైన్స్‌ అధికారులు దాడులు చేపట్టారు. కొమిరి సమీపంలో నాగావళి నది వద్ద ఇసుక అక్రమ రవాణా కాకుండా ట్రెంచ్‌లు ఏర్పాటు చేశారు.. అయితే వెంకటాపురం సమీప గ్రామమైన గదబవలస వద్ద పగలు, రాత్రి తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణా చేసినప్పటికీ ఇక్కడ రెవెన్యూ అధికారులు ట్రెంచ్‌లు ఏర్పాటు చేయకపోవడంతో పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణాలో స్థానిక వైసిపి నేత హస్తం ఉందని, ఆయన కనుసన్నల్లో ఇసుక దందా సాగుతోందనే ప్రచారం ఉంది. అయినా, ఆ ప్రాంతంలో ట్రెంచ్‌లు తీయకపోవడం ఏమిటని పలు గ్రామాల ప్రజలు విమర్శిస్తున్నారు. కొమిరి నాగావళి నది నుంచి ఇసుక రవాణా లేని చోట ట్రెంచ్‌లు ఏర్పాటు చేయడం పట్ల ప్రజలు పెదవి విరుస్తున్నారు. రేగిడి మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న నాగావళి నది నుంచి రేయింబవళ్లు ఇసుక అక్రమ రవాణా సాగేది. రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించిన నేపథ్యంలో రెండు రోజులు రవాణా నిలుపుదల చేశారు. అనంతరం ఇసుక దందాను మళ్లీ ప్రారంభించారు. అక్రమంగా ఇసుకను వివిధ పట్టణాలకు తరలిస్తున్నారు. రేగిడి, గదబవలస వద్ద నాగావళి నది తీరంలో ట్రెంచులను తీయకపోవడంతో రెవెన్యూ అధికారుల తీరుపై పలువురు అనుమానాలు వ్యక్తంచేశారు. అధికార పార్టీ నాయకులకు లోబడి రెవెన్యూ అధికారులు పనిచేస్తున్నారా? అనే విమర్శలు వినిపిస్తున్నాయి.. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టిసారించి గదబవలస, రేగిడి నాగావళి నది వద్ద అక్రమ ఇసుక రవాణా అరికట్టేందుకు ట్రెంచులు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.

➡️