హామీలు అమలునే కోరుతున్నాం..

గుంటూరులో మోకాళ్లపై నిలుచొని నిరసన తెలియజేస్తున్న కార్మికులు, నాయకులు
ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా :
మున్సిపల్‌ కార్మికుల నిరవధిక సమ్మెలో భాగంగా గుంటూరులో నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట, పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలోని మున్సిపల్‌ కార్యాలయం వద్ద సమ్మె శిబిరంలో బుధవారం కార్మికులు మోకాళ్లపై నిలుచొని నిరసన తెలిపారు. ఈ రెండు శిబిరాల్లో ఏపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు మాట్లాడారు. ముఖ్యమంత్రి మున్సిపల్‌ కార్మికులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు సమాన పనికి సమాన వేతనం, కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులందరినీ పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.ఎన్నికల మేనిఫెస్టోలో సమాన పనికి సమాన వేతనం ప్రాతిపదికన న్యాయం చేస్తామని పేర్కొన్నారని, కానీ నాలుగున్నరేళ్ల నుండి అమలు చేయలేదని అన్నారు. మున్సిపల్‌ కార్మికులు సమ్మెలోకి వెళ్లటానికి ప్రభుత్వమే కారణమన్నారు. సమస్య పరిష్కారం చేసే వరకు నిరవధిక సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి బి.ముత్యాలరావు మాట్లాడుతూ ఒకే విధమైన పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు రెండు రకాలు జీతాలు అన్యాయమన్నారు. చాలీ చాలని జీతాలతో కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులు, ఉద్యోగుల జీవితాలు దుర్భరంగా మారాయన్నారు. మున్సిపల్‌ కార్మికుల సమ్మెకు జనసేన రాష్ట్ర కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస యాదవ్‌, జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, నగర అధ్యక్షులు నేరెళ్ళ సురేష్‌, టియన్‌టియుసి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జి.శేషగిరిరావు, రాష్ట్ర నాయకులు నారా జోషి పాల్గొని మద్దతు తెలిపారు. పల్నాడు శిబిరంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ముజఫర్‌ అహ్మద్‌, ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా గౌరవ అధ్యక్షులు షేక్‌ సిలార్‌ మసూద్‌, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.ముత్యాలరావు మాట్లాడారు. సిఐటియు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఆంజనేయ నాయక్‌, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఎ.సాల్మన్‌, కార్మికులు డి.యోహాను, టి.మల్లయ్య, పి.ఏసు, దీనమ్మ, మార్తమ్మ, నరసింహారావు, అల్లాబక్షు, మహేష్‌, వెంకట్‌, శేఖర్‌, సింగ్‌ పాల్గొన్నారు.

➡️