హామీలు అమలు చేయాలి

Jan 11,2024 14:13 #Anganwadi strike, #nandyala

– కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి
– సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.నాగరాజు
– కలెక్టరేట్‌ ఎదుట మున్సిపల్‌ కార్మికులు ధర్నా
ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్‌
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం, పాదయాత్రలో, అసెంబ్లీ సాక్షిగా సిఎం జగనన్న ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.నాగరాజు డిమాండ్‌ చేశారు. సోమవారం జిల్లావ్యాప్తంగా తరలి వచ్చిన మున్సిపల్‌ కార్మికులు, పారిశుధ్య కార్మికులు స్థానిక నూనెపల్లి ప్లై ఓవర్‌ బ్రిడ్జి నుండి కలెక్టరేట్‌ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ వద్ద నిరసన ధర్నా చేపట్టారు. సిఎం మొండి వైఖరి నశించాలంటూ మున్సిపల్‌ కార్మికులు నినదించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకులు భాస్కరచారి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎ.నాగరాజు మాట్లాడుతూ విభజించు పాలించు పద్దతిలో బ్రిటీష్‌ పాలనను పోలిన పాలనను సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్టంలో అమలు చేస్తున్నారని అన్నారు. స్వచ్ఛ భారత్‌, పారిశుధ్య కార్మికులు నమ్మి ఓట్లు వేస్తే ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సిఎం కార్మికులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. డోన్‌లో 10 మంది కార్మికులు చనిపోతే వారి పిల్లలను చేర్చుకోవడం లేదని, ఇతరులకు అవకాశాలు ఇస్తున్నారని సిఎంపై మండిపడ్డారు. ఏళ్ల నుండి పని చేస్తున్న పారిశుధ్య కార్మికుల గురించి సిఎం జగన్‌ పట్టించుకోవడం లేదన్నారు. పెరుగుతున్న పట్టణాల జనాభాకు అనుగుణంగా పారిశుధ్య కార్మికులు లేరని, ఉన్న కార్మికులు పని భారంతో అల్లాడిపోతున్నరని చెప్పారు. రూ. 270 కోట్లు ఇస్తే మున్సిపల్‌ కార్మికులు సమస్యలు పరిష్కరించవచ్చన్నారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు, మున్సిపల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షులు ఏసురత్నం మాట్లాడుతూ కార్మికులు జీతాలపైనే ఆధారపడి బతుకుతున్నారని, 5 సంవత్సరాలకు ఒక్కసారి జీతాలు పెంచుతామంటే వారి కుటుంబాలు ఎలా గడుస్తాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు అవసరమైనప్పుడు వారి వేతనాలు పెంచుకోవచ్చని, ఒక్కసారి ఎమ్మెల్యే అయితే జీవితాంతం పెన్షన్‌ ఇవ్వొచ్చు కానీ కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదన్నారు. కార్మికవర్గంకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఎందుకు చొరవ చూపడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించి సమ్మె విరమింపజేయాలని విజ్ఞప్తి చేశారు. సిఐటియు పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు మహమ్మద్‌ గౌస్‌, డి.లక్ష్మణ్‌, డోన్‌ నాయకులు శివరాం, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా వచ్చిన మున్సిపల్‌ కార్మికులు పాల్గొన్నారు.

➡️