10న మన్యం బంద్‌ జయప్రదం చేయండి

ఆదివాసీ గిరిజన సంఘం

ఆదివాసీ గిరిజన సంఘం పిలుపు

ప్రజాశక్తి- పెదబయలు : మెగా డిఎస్‌సి, ఇతర ఉద్యోగాల భర్తీలో మన్యవాసులకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ఈనెల 10న నిర్వహించే రాష్ట్రవ్యాప్త మన్యం బంద్‌ను జయప్రదం చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు సాగిన ధర్మన్నపడాల్‌, పూర్వ అధ్యక్షుడు బోండా సన్నిబాబు, జిల్లా కమిటీ సభ్యులు జె.సునీల్‌కుమార్‌పిలుపునిచ్చారు. మంగళవారం పెదబయలులోని ఆదివాసీగిరిజన సంఘం కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ, ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన మెగా డిఎస్‌సిలో ఆదివాసీ నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. మొత్తం ఉపాధ్యాయ పోస్టుల్లో గిరిజన ప్రాంతంలో 1025 కేటాయిస్తే, వాటిల్లో కేవలం రెండు శాతమే ఉన్న గిరిజనేతరులకు 95శాతం పోస్టులు, 98శాతం ఉన్న గిరిజనులకు రెండు శాతం పోస్టులు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేయడం దుర్మార్గమన్నారు. ల్లూరి జిల్లాలో 175 పోస్టుల్లో కేవలం 7పోస్టులు గిరిజనులకు కేటాయించగా, రంపచోడవరం చింతూరు ఏజెన్సీ ప్రాంతాల్లో 205 పోస్టులకు గాను 10, సీతంపేట ఏజెన్సీలో 35 పోస్టులకు ఆరు పోస్టులు. పార్వతీపురం ఐటిడిఎ పరిధిలో 70 పోస్టులకు గాను ఎనిమిది పోస్టులు, మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 500 పోస్టులకు 38 పోస్టులు మాత్రమే ఎస్‌టిలకు కేటాయించారన్నారు. ఏజెన్సీవాసులకు శతశాతం ఉద్యోగవకాశాలను కల్పించే జిఒ3ను సుప్రీంకోర్టు రద్దు చేసిన తర్వాత, దీనిపై రివ్యూ పిటిషన్‌ కోర్టులో పెండింగ్‌లో ఉన్న పరిస్థితుల్లో మన్యవాసులకు నష్టం కలిగించేలా డిఎస్‌సి ఉద్యోగ నియామకాలు చేపట్టడం సరికాదన్నారు. ఇప్పటికే ఐసిడిఎస్‌, విద్యాశాఖ, ఏకలవ్య పాఠశాలలు, వైద్యఆరోగ్యశాఖల్లో చేపట్టిన నియామకాల్లో ఉద్యోగాలను దొడ్డిదారిన గిరిజనేతరులకు కట్టబెట్టిందన్నారు. ఇపుడు డిఎస్‌సి నియామకాల్లోనూ అన్యాయం చేస్తోందన్నారు. దీన్ని నిరసిస్తూ 10న చేపట్టే మన్యం బంద్‌లో ఉద్యోగులు, నిరుద్యోగులు, కార్మిక, కర్షకులు, విద్యార్థులు , మేధావులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

మాట్లాడుతున్న ఆదివాసీ గిరిజన సంఘం నేతలు ధర్మన్న పడాల్‌, సన్నిబాబు

➡️