14న మండలాల్లో నిరసనలు జయప్రదం చేయండి

Mar 10,2024 23:27

సమావేశంలో మాట్లాడుతున్న రమాదేవి
ప్రజాశక్తి-గుంటూరు :
రైతులు మార్చి 14న తలపెట్టిన చలో ఢిల్లీకి మద్దతుగా అదేరోజు మండల కేంద్రాల్లో జరిగే సంఘీభావ కార్యక్రమాల్లో కార్మిక వర్గంపెద్ద సంఖ్యలో పాల్గొనాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి దయా రమాదేవి పిలుపునిచ్చారు. ఆదివారం సిఐటియు జిల్లా విస్తృత సమావేశం దండా లక్ష్మీనారాయణ అధ్యక్షతన పాత గుంటూరులోని యూనియన్‌ జిల్లా కార్యాలయంలో జరిగింది. రమాదేవి మాట్లాడుతూ రైతులు పండిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, మద్దతు ధరలు ప్రకటించాలని, కార్పొరేట్‌ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ జరుగుతున్న ఆందోళనకు మద్దతుగా చలోఢిల్లీ కార్యక్రమం జరుగుతుందన్నారు. కావున రైతులకు మద్దతుగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున 14వ తేదీన సంఘీభావం తెలపాలన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజీ మాట్లాడుతూ కార్మిక కర్షక ఐక్యతతోనే కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పి కొట్టాలని, దానిలో భాగంగా మండల కేంద్రాల్లో జరిగే నిరసనల్లో రైతులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సిఐటియు కార్యదర్శి శివాజీ, బి.లక్ష్మణరావు, ఉపాధ్యక్షులు మస్తాన్‌వలి, కె.శ్రీనివాసరావు, రాధా, సుకన్య పాల్గొన్నారు.

➡️