16న గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయండి

Feb 10,2024 21:42

 ప్రజాశక్తి – కురుపాం : కేంద్రప్రభుత్వం గిరిజన, రైతు, కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు, రాష్ట్రానికి చేసిన ద్రోహానికి నిరసనగా అన్ని ప్రజా సంఘాలు కలిసి దేశవ్యాప్తంగా ఈనెల16న తలపెట్టిన బంద్‌ను, మండల కేంద్రంలో చేపట్టబోయే ర్యాలీ, నిరసన సభల్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రెడ్డి వేణు కోరారు. మండలంలోని గుజ్జువాయి, డి.బారామణి, పోరడంగూడా, జి.సివడ, ఉదయపురం గ్రామాల్లో గిరిజన సంఘం నాయకులతో శనివారం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన హక్కులపై దాడిచేసి, జిఒ 3నురద్దు చేసి, అడవులను అదానీకి కట్టబెట్టిందుకు అటవీ సంరక్షణ చట్టానికి నిరసనగా ఆందోళన చేపట్టాలన్నారు. అలాగే జీడి పంటకు కేజీ రూ.200, చింత పండు కేజీ రూ.60కు ప్రభుత్వం కొనుగోలు చేయాలని, వాహనాలపై పెంచిన రోడ్‌ టాక్స్‌కు , కార్మిక, కర్షక వ్యతిరేక చట్టాలకు నిరసనగా ఈనెల 16న దేశవ్యాప్తంగా రైతు, ప్రజాసంఘాలు ఆధ్వర్యంలో బంద్‌ చేపడుతున్నట్టు తెలిపారు. కావున అన్ని వర్గాల ప్రజలు బంద్‌లో పాల్గొని జయప్రదం కోరారు. కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు వాసు, అంగద, గణేష్‌, అనిల్‌, భవన కార్మిక సంఘం నాయకులు వైకుంఠం తదితరులు పాల్గొన్నారు.

సాలూరురూరల్‌ : బిజెపి ప్రభుత్వం కార్పొరేట్‌, మతతత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఈనెల 16న జరిగే గ్రామీణ బంద్‌ను జయప్రద చేయాలని కోరుతూ మండలంలోని భరణికి వలస, పెద్దవలస, సన్యాసిరాజుపేటలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం చేస్తున్న మోసాలకు వ్యతిరేకంగా ఈనెల 16న దేశవ్యాప్త గ్రామీణ బంద్‌ జరుగుతుందని, ఈ బంద్‌లో ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో గిరిజన సంఘం సభ్యులు పొట్టంగి రాము, గబడారురాము,బోయినలక్ష్మణరావు పాల్గొన్నారు.

కొమరాడ :ఈనెల16న దేశవ్యాప్తం గా జరిగే గ్రామీణ భారత్‌ బంద్‌ను జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు కొల్లి సాంబమూర్తి పిలుపునిచ్చారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కూనేరు సంతలో ప్రచార ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో గిరిజన సంఘ నాయకులు రామారావు, ప్రసాదు బాబురావు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఆర్‌.శివు న్నాయుడు, రైతు సంఘం నాయకులు అప్పల నాయుడు, నిరుద్యోగ యువత పాల్గొన్నారు.

బంద్‌కు సిఐటియు మద్దతు

సాలూరు : మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 16న జరగనున్న భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలని, మద్దతు తెలపాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు డి.రమణారావు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాజకీయ శిక్షణా తరగతుల ప్రారంభానికి ముందు ఆయన సిఐటియు జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడారు. యూనియన్‌ సీనియర్‌ నాయకులు టి.వెంకటరావు జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా రమణారావు మాట్లాడుతూ దేశంలో మోడీ ప్రభుత్వం కార్మిక, కర్షక, వ్యవసాయ కూలీల ప్రయోజనాలను విస్మరించిందని చెప్పారు. కార్పొరేట్‌ అనుకూల విధానాలను అవలంభిస్తూ సామాన్య మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారాలు మోపిందన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా జరగనున్న బంద్‌ను విజయవంతం కోరారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్వైనాయుడు, పట్టణ నాయకులు టి.ఇందు, టి.శంకరరావు పాల్గొన్నారు.

➡️